పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu invites Singapore to partner in Andhra Pradesh development
  • సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ 
  • ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు 
  • ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాల‌ని సూచ‌న‌
  • ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్న‌ సీఎం
  • వెంచర్ కాపిటలిస్టులతో సమావేశమై, రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు సింగపూర్‌లోని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని, ఇక్కడి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు. భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను ఈ సందర్భంగా హై కమిషనర్ అంబులే ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్రం అనుకూలంగా ఉందని వివరించారు. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ప్రపంచ స్థాయి నాణ్యతతో హార్టికల్చర్ ఉత్పత్తులను పండిస్తున్నారని, వీటి ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగపూర్ టెక్నాలజీ రంగ అవసరాలు తీర్చగల నైపుణ్యం ఏపీ యువతకు ఉందని, రోబోటిక్స్, మెడికల్ డివైసెస్ రంగాల్లో సహకారం అందించాలని కోరారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకెళ్తున్న భారత్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చంద్రబాబు ప్రశంసించారు. పెట్టుబడులతోనే సంపద సృష్టి, ఉద్యోగ కల్పన సాధ్యమని, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని కొనియాడారు. ఒకప్పుడు 'హిందూ గ్రోత్ రేట్' అంటూ 1-2 శాతం వృద్ధిని హేళన చేసేవారని, కానీ ఇప్పుడు ప్రధాని మోదీ విధానాలతో పరిస్థితి పూర్తిగా మారిందని అన్నారు. ఆయన చొరవతోనే కియా, ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయని గుర్తుచేశారు.

అనంతరం సింగపూర్‌లోని స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, హై కమిషనర్ శిల్పక్ అంబులే కూడా పాల్గొన్నారు. భారత్ ఇప్పుడు నిద్రపోతున్న దేశం కాదని, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తి అని చంద్రబాబు స్పష్టం చేశారు. 'వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్' విధానంతో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, భూ సమీకరణ ద్వారా అమరావతి వంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. వెంచర్ కాపిటలిస్టులు రాష్ట్రంలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా హై కమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ల రంగాల్లో సింగపూర్ ముందుందని, భారత్‌లోని రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh Investment
Singapore Visit
Shilpak Ambule
Amaravati Development
Startup Venture Capitalists

More Telugu News