ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ

Circar Express massive robbery averted due to passenger courage and police firing
  • సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం
  • అప్రమత్తమైన ప్రయాణికులతో దొంగల పరార్
  • నిందితులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
  • బాపట్ల సమీపంలో ఘటన, ఇద్దరు మహిళల నుంచి బంగారం అపహరణ
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పరిధిలో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ యత్నం కలకలం సృష్టించింది. ప్రయాణికులు అప్రమత్తం కావడం, రైల్వే పోలీసులు తక్షణమే స్పందించడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. దొంగలను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ కు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున సుమారు 1:15 గంటల సమయంలో రైలు బాపట్ల - అప్పికట్ల స్టేషన్ల మధ్య నల్లమడ వాగు రైల్వే బ్రిడ్జి వద్ద ప్రయాణిస్తుండగా, దుండగులు ఎస్-3, ఎస్-6 స్లీపర్ కోచ్‌లలోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి వారు బంగారు ఆభరణాలను అపహరించారు.

దొంగల కదలికలను గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో దుండగులు ఆందోళనకు గురయ్యారు. పట్టుబడతామనే భయంతో వెంటనే రైలు చైన్‌ను లాగి నిలిపివేశారు. అనంతరం రైలు నుంచి కిందకు దూకి చీకట్లో పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న రైల్వే పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ, దుండగులు చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
Go Back to Shorts
Circar Express
Bapatla Train Robbery
Andhra Pradesh Railway Police
Train Theft Attempt
Nallamada Vagu Bridge
Railway Police Firing

More Telugu News