మీ గ్యాస్ సిలిండర్‌పై A-26, D-28 అనే కోడ్ లు ఉన్నాయా? దాని అర్థం ఇదే!

LPG Gas Cylinder codes A-26 and D-28 meaning explained
  • LPG సిలిండర్‌పై ఉండే కోడ్ సేఫ్టీ టెస్ట్ తేదీని సూచిస్తుంది
  • A, B, C, D అక్షరాలు సంవత్సరం త్రైమాసికాలను తెలియజేస్తాయి
  • అక్షరం పక్కన ఉండే సంఖ్య పరీక్ష జరగాల్సిన సంవత్సరాన్ని సూచిస్తుంది
  • గడువు తేదీ దాటిన సిలిండర్ వాడటం అత్యంత ప్రమాదకరం
  • కొత్త సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ కోడ్‌ను తప్పక గమనించాలి
మనం ఇళ్లలో వాడే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల మీద A-26, B-27, D-28 వంటి కోడ్‌లు ఉండటం చాలామంది గమనించే ఉంటారు. దీనిని సిలిండర్ గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్) అని చాలామంది పొరపడుతుంటారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఈ కోడ్ సిలిండర్‌కు తదుపరి భద్రతా పరీక్ష (సేఫ్టీ టెస్ట్) ఎప్పుడు చేయాలో సూచిస్తుంది.

ఈ కోడ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ కోడ్‌ను అర్థం చేసుకోవడం చాలా సులభం. సిలిండర్ పైభాగంలో ఉన్న మెటల్ రింగ్ మీద ఈ వివరాలు ముద్రించి ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ అక్షరం సంవత్సరాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజిస్తుంది. A- జనవరి నుంచి మార్చి... B- ఏప్రిల్ నుంచి జూన్... C- జూలై నుంచి సెప్టెంబర్... D-అక్టోబర్ నుంచి డిసెంబర్ అన్నమాట.

అక్షరం పక్కన ఉండే రెండు అంకెల సంఖ్య... పరీక్ష జరగాల్సిన సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక సిలిండర్‌పై B-26 అని ఉంటే, దానికి 2026 ఏప్రిల్-జూన్ మధ్యలో సేఫ్టీ టెస్ట్ చేయాలని అర్థం. అలాగే D-28 అని ఉంటే, 2028 అక్టోబర్-డిసెంబర్ మధ్య పరీక్ష జరగాల్సి ఉంటుంది.

ఈ పరీక్ష ఎందుకు ముఖ్యం?
ఎల్‌పీజీ సిలిండర్లలో గ్యాస్‌ను అధిక పీడనంతో నింపుతారు. కాలక్రమేణా సిలిండర్లలో లీకులు, తుప్పు పట్టడం లేదా ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నిర్దిష్ట కాలవ్యవధిలో హైడ్రోస్టాటిక్ టెస్టింగ్ వంటి భద్రతా పరీక్షలు చేసి వాటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. గడువు తేదీ దాటిన సిలిండర్లను వాడటం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీరు కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకునే ప్రతిసారీ ఈ తేదీని తనిఖీ చేసుకోండి. ఇండేన్, హెచ్‌పీ, బీపీసీఎల్ వంటి అన్ని గ్యాస్ కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తాయి.
Go Back to Shorts
LPG Gas Cylinder
Gas Cylinder Safety Codes
LPG Expiry Date Meaning
Gas Cylinder Testing Dates
LPG Safety Tips
Indane HP Gas Cylinder

More Telugu News