వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా

Ahmedabad company tracks employee washroom breaks in new surveillance policy
  • ఉద్యోగుల వాష్‌రూమ్‌ బ్రేక్‌లను లెక్కపెడుతున్న కంపెనీ
  • 30 నిమిషాలకు మించి బ్రేక్‌ తీసుకున్నాడంటూ హెచ్చరిక
  • అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశం
  • మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ ఉద్యోగి ఆవేదన
  • కొత్త ఉద్యోగం చూసుకోవాలని నెటిజన్ల సలహా
ఆఫీసులో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి పలు రకాల విధానాలు అమలు చేస్తుంటారు. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరింత ముందుకెళ్లింది. ఉద్యోగులు వాష్‌రూమ్‌కు ఎన్ని సార్లు వెళ్లారు? అక్కడ ఎంతసేపు గడిపారు? అనే విషయాలను కూడా లెక్కపెడుతూ కొత్త నిబంధన అమలు చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ విషయాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రెడిట్‌లో వెల్లడించాడు. గత 10 నెలలుగా అదే సంస్థలో పనిచేస్తున్నానని, ఇటీవలే మేనేజ్‌మెంట్‌ వాష్‌రూమ్‌ బ్రేక్‌లను గమనించడం ప్రారంభించిందని తెలిపాడు. ఓ రోజు తాను వాష్‌రూమ్‌కు వెళ్లిన మొత్తం సమయం 53 నిమిషాలు అయ్యిందని, కంపెనీ నిర్ణయించిన గరిష్ఠ పరిమితి 30 నిమిషాలు మాత్రమేనని చెప్పినట్లు వెల్లడించాడు. అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశించారని పేర్కొన్నాడు.

చాలాకాలంగా ఇలా బ్రేక్‌లు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా సమస్యగా చూపించడం అర్థం కావడం లేదని వాపోయాడు. తాను పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నానని, వాష్‌రూమ్‌కు వెళ్లేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ను కూడా డెస్క్‌పైనే ఉంచి వెళ్తానని తెలిపాడు. వాష్‌రూమ్‌ కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండటంతో సమయాన్ని వృథా చేసే పరిస్థితీ లేదని వివరించాడు.

అయినా కంపెనీ వ్యవహరిస్తున్న తీరు తనపై మానసిక ఒత్తిడి పెంచుతోందని ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టు వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. సదరు వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోందని, వెంటనే కొత్త ఉద్యోగం వెతకాలని సూచించారు. మరికొందరు ఇలాంటి వాతావరణంలో పనిచేయడం కష్టమని, వీలైనంత త్వరగా ఆ సంస్థను వీడటం మంచిదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Ahmedabad Company
Employee Monitoring
Washroom Break Policy
Workplace Surveillance
Reddit Viral Post
Gujarat Corporate Culture

More Telugu News