ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ
- 42 ఏళ్ల తర్వాత ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
- తెలుగు సబ్జెక్టులో 72 మార్కులతో ఉత్తీర్ణత
- ఇటీవల లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ
- న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ, 1980-82 మధ్య స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరారు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) ప్రభావంతో ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసినా, ఒక్క తెలుగు పరీక్ష మాత్రం రాయలేకపోయారు. రాసిన సబ్జెక్టులన్నిటిలోనూ పాసయ్యారు. అప్పట్లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన చదువు అసంపూర్తిగా మిగిలిపోయింది.
జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన చదువును పూర్తి చేయాలని భావించిన దేవ్‌జీకి తెలంగాణ ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆయన మిగిలి వున్న తెలుగు పరీక్షకు హాజరయ్యారు. గురువారం విడుదలైన ఫలితాల్లో దేవ్‌జీ తెలుగులో 72 మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆయన మొత్తం 614 మార్కులతో ఇంటర్ పూర్తి చేసినట్లయింది.
న్యాయవాద వృత్తిపై ఆసక్తితో దేవ్‌జీ ఇటీవలే లాసెట్ పరీక్ష రాయగా, అందులో 349వ ర్యాంకు సాధించడం విశేషం. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి కావడంతో ఐదేళ్ల లా కోర్సులో చేరేందుకు ఆయనకు మార్గం సుగమమైంది.
ఎవరీ దేవ్‌జీ?
సాధారణ సభ్యుడిగా మావోయిస్టు ఉద్యమంలో చేరిన దేవ్‌జీ, అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తిరుపతి అలిపిరి వద్ద జరిగిన దాడి, 2010లో దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనల్లో దేవ్‌జీ కీలక సూత్రధారిగా ఉన్నారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఆయనపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కలిపి రూ.కోటి రివార్డు కూడా ఉండేది. అలాంటి తీవ్రమైన గతం ఉన్న వ్యక్తి, ఇప్పుడు శాంతియుత మార్గంలో విద్య ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.