బాంబులతో మాట్లాడడంలో మా కంటే గొప్పవాళ్లు లేరు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక!

  • ఒప్పందం లేకపోతే దాడులు కొనసాగింపు
  • మరిన్ని సైనిక దాడులకు సంకేతం
  • ఇరాన్‌కు ఇంకా అవకాశం ఉందన్న హెగ్సెత్‌
  • ట్రంప్‌ ఒప్పందం అంగీకరించాలని సూచన
అణు కార్యక్రమంపై అమెరికా ప్రతిపాదించిన ఒప్పందాన్ని ఇరాన్‌ అంగీకరించకపోతే దాడులు కొనసాగుతాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్‌ హెచ్చరించారు. అవసరమైతే ‘బాంబులతోనే చర్చలు జరుపుతాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో తమకంటే మెరుగైన వారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌కు ఇంకా ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని హెగ్సెత్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన అణు ఒప్పందాన్ని అంగీకరిస్తే పరిస్థితి మారుతుందని చెప్పారు. అయితే ఇంకా ఇరాన్‌ చర్చలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఫలితంగా అమెరికా ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతుగా సైనిక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అధ్యక్షుడు ఆశిస్తున్న ఒప్పందాన్ని సాధించేందుకు అవసరమైన పరిస్థితులు సృష్టించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగేందుకు అమెరికా చర్యలు చేపడుతోందని హెగ్సెత్‌ తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా భద్రతతో 100 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా చమురు రవాణా జరిగిందన్నారు. ఇరాన్‌ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే దాదాపు 140 నౌకలను అడ్డుకున్నామని కూడా చెప్పారు. ఇటీవలి సైనిక చర్యలతో ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్తులో కూడా లక్ష్యిత దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు.

అయితే ఇరాన్‌కు ఇప్పటికీ అవకాశం ఉందని హెగ్సెత్‌ పునరుద్ఘాటించారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఒప్పందాలు కుదర్చడంలో నిపుణుడని, ఇరాన్‌ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదని సూచించారు. లేదంటే అమెరికా మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Pete Hegseth
Iran nuclear deal
Donald Trump
US Iran tensions
Strait of Hormuz
US military strikes

More Telugu News