ప్రధాని కారులో చైనా నిఘా పరికరమా? బ్రిటన్‌లో కలకలం!

  • బ్రిటన్‌ ప్రధాని కారులో ట్రాకర్‌ ఆరోపణ
  • చైనాకు డేటా వెళ్లిందని వాదన
  • పార్లమెంట్‌లో మాజీ దౌత్యవేత్త వ్యాఖ్యలు
  • స్పందించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరణ
  • ఆరోపణలను ఖండించిన చైనా
బ్రిటన్‌లో చైనా గూఢచర్యం ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని అధికారిక కారులో చైనాకు సమాచారాన్ని పంపగలిగే ట్రాకింగ్‌ పరికరం గుర్తించారన్న సంచలన వాదన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

ఈ ఆరోపణలను బ్రిటన్‌కు చెందిన మాజీ దౌత్యవేత్త చార్ల్స్‌ పార్టన్‌ పార్లమెంట్‌ సభ్యుల ముందు వెల్లడించారు. 2022లో ప్రభుత్వ వాహనాల భద్రతా తనిఖీల సమయంలో ప్రధాని ఉపయోగించిన కారులో అనుమానాస్పద పరికరం బయటపడిందని చెప్పారు. ఆ పరికరం సెల్యులార్‌ మాడ్యూల్‌ ద్వారా చైనాకు డేటాను పంపుతున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.

సెల్యులార్‌ మాడ్యూల్స్‌ అనేవి మొబైల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా సమాచారాన్ని పంపే ఎలక్ట్రానిక్‌ పరికరాలు. ప్రస్తుతం కార్లు, విమానాలు, స్మార్ట్‌ పరికరాల్లో ఇవి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చైనాలో తయారైన ఓ సీల్డ్‌ కంపోనెంట్‌లో ఈ పరికరం దాచినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో పేర్కొన్న కారు ఏ ప్రధాని ఉపయోగించిందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఆ సమయంలో బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ ప్రధానులుగా పనిచేశారు.

ఈ ఆరోపణలపై బ్రిటన్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. భద్రతకు సంబంధించిన అంశాలపై వ్యాఖ్యానించబోమని మాత్రమే తెలిపింది. ప్రధాని భద్రతను పర్యవేక్షించే మెట్రోపాలిటన్‌ పోలీసులు కూడా ఇదే వైఖరి అవలంబించారు. మరోవైపు చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని పేర్కొంది. చైనా సంస్థలపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. అయితే ఈ ఘటనతో ప్రభుత్వ వాహనాలు, కీలక మౌలిక సదుపాయాల్లో ఉపయోగిస్తున్న విదేశీ సాంకేతిక పరికరాల భద్రతపై బ్రిటన్‌లో చర్చ మొదలైంది.

British Prime Minister
Chinese spying UK
Tracking device PM car
Charles Parton
UK security breach
Cellular modules surveillance

More Telugu News