5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’ ఇస్తే రిజల్ట్‌ ఇదే!

Magic Mushrooms result in recovery after five years of memory loss
  • ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చిన మాటలు, నడక
  • 19 గంటల తర్వాత అద్భుతమైన మార్పులు
  • నిద్రాణమైన మెదడు నెట్‌వర్క్‌లు యాక్టివేట్
  • నియంత్రణలోకి మూత్ర విసర్జన
  • భవిష్యత్తు పరిశోధనలకు కొత్త ఆశ
అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి) ముదిరిపోతే పాత జ్ఞాపకాలు, శారీరక నియంత్రణ మళ్లీ రావడం అసాధ్యమని వైద్య ప్రపంచం నమ్ముతుంది. కానీ, బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుత సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ వైద్యులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు పదేళ్లుగా అల్జీమర్స్‌తో బాధపడుతోంది. ఐదేళ్లుగా కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేని స్థితిలో ఉంది. శాస్త్రవేత్తలు ప్రయోగంలో భాగంగా ‘మ్యాజిక్ మష్రూమ్స్’ (సిలోసిబిన్ కలిగిన పుట్టగొడుగులు)ను ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మార్పులు చూసి అందరూ అవాక్కయ్యారు.

సదరు జపనీస్-అమెరికన్ వృద్ధురాలి పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. ఐదేళ్లుగా మాటలు రావు. నడవడం కష్టం. మింగడం రాదు. మూత్రవిసర్జనపై అసలు నియంత్రణ లేదు. ఆమె ఇక కోలుకోవడం అసాధ్యమని వైద్యులు తేల్చేశారు. అలాంటి స్థితిలో ఉన్న ఆమెకు సైంటిస్టులు ఐదు గ్రాముల ‘ఎనిగ్మా స్ట్రెయిన్’ అనే అత్యంత శక్తివంతమైన మ్యాజిక్ మష్రూమ్స్ డోస్ ఇచ్చారు. దీన్ని వైద్య పరిభాషలో ‘హీరోయిక్ డోస్’ అంటారు.

పుట్టగొడుగులు తిన్న తర్వాత ఆమెకు విపరీతంగా చెమటలు పట్టాయి. దాదాపు జ్వరం వచ్చినట్లుగా మారి గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. డోస్ ఇచ్చిన 19 గంటల తర్వాత విచిత్రం జరిగింది. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న ఆ ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచి తన జీవితంలోని పాత జ్ఞాపకాల గురించి గంటల తరబడి అనర్గళంగా మాట్లాడటం ప్రారంభించింది.

తర్వాత కొద్దిరోజుల్లోనే ఆమెలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మూత్ర విసర్జన నియంత్రణలోకి వచ్చింది. ఎవరి సాయం లేకుండానే సొంతంగా నడవడం, బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు. ముఖంలో భావాలు పలికాయి. నవ్వడం, కుటుంబ సభ్యులను గుర్తించడం మొదలుపెట్టారు. నెల రోజుల తర్వాత ఇచ్చిన మరో డోస్‌తో ఆమెలో హాస్యం కూడా పెరిగింది.

‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూరోసైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కేస్ స్టడీ ప్రకారం.. మ్యాజిక్ మష్రూమ్స్‌లో ఉండే సిలోసిబిన్ అనే పదార్థం మెదడులోని నరాల మధ్య సరికొత్త కనెక్షన్లను  పునరుద్ధరిస్తుంది. రోగం వల్ల దెబ్బతిన్నప్పటికీ.. మెదడులో ఇంకా సజీవంగా ఉండి, నిద్రాణస్థితిలోకి వెళ్లిన నెట్‌వర్క్‌లను ఇది తాత్కాలికంగా యాక్టివేట్ చేసి ఉంటుందని బ్రెజిల్ పరిశోధకులు భావిస్తున్నారు.

ఇది కేవలం ఓ రోగిపై జరిగిన పరిశీలన మాత్రమే. దీనివల్ల అల్జీమర్స్ పూర్తిగా నయమైపోతుందని అనుకోలేం. పైగా ఇది ఇంట్లో చేసిన ప్రయోగం కాదు. బ్రెజిల్‌లోని ల్యాబ్‌లో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో చేశారు. ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్లే స్వయంగా మష్రూమ్స్‌ ఇచ్చారు. సాధారణ పుట్టగొడుగులను ఎక్కడైనా కొనవచ్చు. కానీ మ్యాజిక్ మష్రూమ్స్ తింటే మత్తు, వింత ప్రవర్తన వస్తుంది కాబట్టి భారత్‌తో పాటు చాలా దేశాల్లో వీటిని వినియోగించడం, అమ్మడం చట్టరీత్యా నేరం.
Go Back to Shorts
Magic Mushrooms
Alzheimers treatment
Psilocybin therapy
Memory loss recovery
Brazil medical study
Enigma strain mushrooms

More Telugu News