రాజీనామా చేసి హిమంతను కలిసిన టీఎంసీ ఎంపీ
- మమతా బెనర్జీకి భారీ షాక్ ఇచ్చిన సుష్మితా దేవ్
- తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపిన సుష్మిత
- కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి వెళ్లి... ఇప్పుడు బీజేపీ వైపు
టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు గంటల వ్యవధిలోనే మరో ఎంపీ కూడా అదే బాట పట్టడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుష్మితా దేవ్ బుధవారం తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపుతూ, దీనిని తక్షణమే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
అసోం కాంగ్రెస్ దిగ్గజ నేత సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుష్మితా దేవ్.. గతంలో అసోంలోని సిల్చార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2021లో టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ ఆమెకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు రాజ్యసభ సీటు ఇచ్చి పెద్దపీట వేశారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా ఆమె పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది.
రాజీనామా సమర్పించిన వెంటనే సుష్మితా దేవ్ ఢిల్లీలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వలసల పర్వం మమతా బెనర్జీ జాతీయ రాజకీయ వ్యూహాలకు పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తోంది.