హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త

  • మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
  • మరొకరితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఘాతుకం
  • మృతురాలు నిందితుడి రెండో భార్య, సొంత మరదలు
  • తుపాకీ ఎలా సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. మల్కాజ్‌గిరి మారుతి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే, వేధింపుల కారణంగా ఆమె విడిపోయి దూరంగా ఉంటోంది. అనంతరం ఆమె సొంత చెల్లెలైన ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టి, ఐదేళ్ల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మారుతి నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

కొంతకాలంగా ఉషారాణి మరొకరితో ఫోన్‌లో చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉషారాణి కూడా భర్తకు దూరంగా ఉంటోంది. తన నుంచి దూరంగా ఉండటంతో ఆమెపై పగ పెంచుకున్న అరుణ్, హత్యకు ప్లాన్ చేశాడు. మాట్లాడుకుందామని నమ్మించి ఇంటికి పిలిపించి, తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు.

బుల్లెట్ తగలడంతో ఉషారాణి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ అరుణ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.



Arun
Usha Rani
Malkajgiri murder case
Hyderabad crime news
Husband kills wife Hyderabad
Maruti Nagar shooting incident

More Telugu News