స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు: బొత్స సత్యనారాయణ

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్న బొత్స
  • బాధితులు కోరుతున్న పరిహారం ఇవ్వాలని వ్యాఖ్య
  • మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఘోర ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కేకే రాజులతో కూడిన బృందం పరామర్శించింది. అనంతరం మీడియాతో బొత్స మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. బాధితులు కోరుతున్న పరిహారం గొంతెమ్మ కోరిక కాదని, ప్రభుత్వం వారి డిమాండ్లను తక్షణమే అంగీకరించాలని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్టీల్‌ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టేందుకు, ప్రైవేటీకరణ చేసేందుకే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కుట్రల వల్లే ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు జరుగుతూ కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆరోపించారు.


స్టీల్‌ ప్లాంట్ నుంచి సమర్థులైన, అనుభవజ్ఞులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుందని బొత్స విమర్శించారు. ఇప్పటికే దాదాపు 10 వేల మంది శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని, ఇకనైనా బలవంతపు వీఆర్‌ఎస్‌ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ‘ఎల్జీ పాలిమర్స్’ తరహాలో కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఈ విషయంలో వైసీపీ రాజీలేని పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. అలాగే, బాధితులను పరామర్శించేందుకు జగన్ రేపు విశాఖలో పర్యటిస్తారని వెల్లడించారు.


Botsa Satyanarayana
Vizag Steel Plant accident
Vizag Steel Plant privatization
YS Jagan Mohan Reddy Vizag visit
TDP alliance government
Visakhapatnam news

More Telugu News