జాన్వీ కపూర్ తప్పు లేదు.. ‘పెద్ది’ వివాదంపై నటి మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్
- ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను అతిగా గ్లామరైజ్ చేయడంపై కొనసాగుతున్న వివాదం
- ఆమెకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ కౌర్ పోస్ట్
- షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సదరు జూమ్ షాట్లపై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడి
- నటి అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేసిన చిత్ర బృందం
జాన్వీతో చాలా కాలంగా పనిచేస్తున్న సవ్లీన్ కౌర్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయమై స్పందించారు. "హీరోయిన్లు చేసే పాత్రలను బట్టి వారిని తప్పుబట్టడం చాలా సులువు. కానీ తెరవెనుక అసలు ఏం జరిగిందనే టైమ్‌లైన్ వేరేలా ఉంటుంది" అని ఆమె పేర్కొన్నారు. షూటింగ్ సమయంలోనే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ (డబ్బింగ్, ఎడిటింగ్) సమయంలోనూ తన శరీరాన్ని జూమ్ చేసి చూపే కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఒక ప్రొఫెషనల్‌గా నటీనటులకు ఉండాల్సిన హద్దుల గురించి గట్టిగానే మాట్లాడిందని సవ్లీన్ స్పష్టం చేశారు.
రామ్ చరణ్ సపోర్ట్.. లీకైన చాట్స్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. షూటింగ్ సమయంలో నడుము, నాభి భాగాలపై జూమ్ షాట్లు తీస్తున్నప్పుడు జాన్వీ కపూర్ అసౌకర్యానికి గురైందని, ఆ సమయంలో కో-స్టార్ రామ్ చరణ్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచి దర్శకుడితో మాట్లాడారని తెలుస్తోంది. అయినప్పటికీ, జాన్వీ మాటలను పక్కనపెట్టి ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ సీన్లను అలాగే ఉంచేశారని, సినిమా విడుదలయ్యాక వివాదం రేగడంతో ఇప్పుడు ఆ తప్పు నటిపైకి నెట్టేలా ప్రచారం సాగుతోందని సవ్లీన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కొన్ని లీకైన వాట్సాప్ చాట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సినిమా జూన్ 4న విడుదలైన తర్వాత మహిళలను ఇలా అందాల వస్తువుగా చూపించడంపై నటి నిత్య మీనన్ వంటి తారలు కూడా విమర్శలు గుప్పించారు. వివాదం ముదరడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పి, థియేటర్ల నుండి దాదాపు 3 నిమిషాల అభ్యంతరకర సీన్లను తొలగించారు. కాగా, ఈ వివాదంపై జాన్వీ కపూర్ ఇప్పటివరకు నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.