ఐఐటీ రిజెక్షన్‌తో డిప్రెషన్.. 26 ఏళ్లకే తండ్రికి రూ.55 లక్షల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్
- పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ పంచుకున్న సక్సెస్ స్టోరీ
- ఐఐటీ-జేఈఈలో ఫెయిల్ అయ్యానని కుంగిపోయిన శౌర్య శిఖర్
- ఒత్తిడితో 110 కిలోలకు పెరిగిన బరువు
- కుంగుబాటు నుంచి బయటపడి శ్రమించిన శిఖర్
- నేడు నెలకు రూ.లక్షల్లో సంపాదన
ఈ అద్భుత విజయానికి వెనుక ఉన్న గతాన్ని పరిశీలిస్తే ఎన్నో కన్నీళ్లు కనిపిస్తాయి. శౌర్య తండ్రి స్వయంగా ఒక ఐఐటీ పూర్వ విద్యార్థి. ఆ కారణంగా శౌర్యపై ఇంట్లో తీవ్రమైన ఒత్తిడి ఉండేది. తీరా చూస్తే జేఈఈ పరీక్షలో అతను ఫెయిల్ అయ్యాడు. ఈ ఓటమి అతణ్ని తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి నెట్టింది. తనపై తనకే నమ్మకం పోయింది. ఇష్టం లేకపోయినా ఓ కాలేజీలో బీబీఏ డిగ్రీలో చేరాడు. తీవ్ర ఒత్తిడి వల్ల అతని బరువు కూడా 110 కిలోలకు పైగా పెరిగిపోయింది. తలిదండ్రులను తలదించుకునేలా చేశాననే బాధ అతణ్ని రోజూ వేధించేది.
ఆ చీకటి రోజుల్లోనే శౌర్య జీవితంలో ఓ చిన్న మార్పు వచ్చింది. కాలేజీలో చదువుతూనే అతను అంకుర్ వారికూ టీమ్‌లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరాడు. అప్పట్లో తన భవిష్యత్తుపై అతనికి ఎలాంటి ఆశలు లేవు. కానీ శౌర్య ఎక్కడా ఆగిపోలేదు. రోజూ నిశ్శబ్దంగా కష్టపడుతూనే ఉన్నాడు. తన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకున్నాడు. పట్టుదలగా శ్రమించి బరువు తగ్గించుకుని అత్యంత ఫిట్‌గా మారాడు. అలా ఐదేళ్ల కఠిన శ్రమతో నేడు నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదించే స్థాయికి ఎదిగాడు. తన తండ్రి రిటైర్మెంట్ కానుకగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
ఈ కథ కేవలం డబ్బు, లగ్జరీ కార్ల గురించి కాదని.. ఒడుదుడుకులను ఎదుర్కొని ఎలా నిలబడాలనే దానికి నిదర్శనమని వారికూ పేర్కొన్నారు. మనం నమ్మిన దారిలో ముందుకు సాగితే జీవితం ఏదో ఒక రోజు కచ్చితంగా సెట్ అవుతుందని శౌర్య నిరూపించాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. మనకు అత్యంత దారుణమైన రోజులు ఎదురైనప్పుడు ఆశావాదం కంటే మనం చేసే పనే మనల్ని కాపాడుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఒక్క పరీక్ష లేదా ఒక్క రిజెక్షన్ మన భవిష్యత్తును మార్చలేవని, అసలైన కథ ఓటమి తర్వాతే మొదలవుతుందని శౌర్య సక్సెస్ స్టోరీ చాటిచెబుతోంది.