బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ యాత్రికులు మృతి
- కాశీ యాత్రకు వెళ్లిన నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం
- బీహార్‌లోని ఔరంగబాద్ వద్ద జరిగిన దుర్ఘటన
- ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి
- మరో 15 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా సంగం నుంచి జూన్ 1న 43 మంది యాత్రికులతో ఒక ప్రైవేట్ బస్సు కాశీ యాత్రకు బయల్దేరింది. ఆదివారం అర్ధరాత్రి బీహార్ రాష్ట్రంలోని ఔరంగబాద్ సమీపంలో జాతీయ రహదారి-2పై ఈ ప్రమాదం జరిగింది. గయ నుంచి వారణాసికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న మరో వాహనం బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ఎడమ వైపున కూర్చున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు, గాయపడిన వారు నెల్లూరు జిల్లా సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరాయి రాష్ట్రంలో ప్రమాదానికి గురైన తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.