లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే!
- లాలూ రబ్రీలకు సెక్యూరిటీ తగ్గింపు
- జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు
- కొత్త సిబ్బందిని వెనక్కి పంపించిన లాలూ
బీహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిలకు ఇన్నాళ్లూ ఉన్న అత్యున్నత ‘Z+’ కేటగిరీ భద్రతను బీజేపీ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని స్థానంలో బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందిని కేటాయించింది. లాలూ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించింది. తమ నివాసానికి వచ్చిన కొత్త భద్రతా సిబ్బందిని వారు లోపలికి రానివ్వకుండా వెనక్కి పంపేశారు.
లాలూ చిన్నకుమారుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు ఉన్న ‘Y+’ భద్రతను, లాలూ కుమార్తె మిసా భారతికి ఉన్న భద్రతను మాత్రం కొనసాగించారు. కానీ తన తల్లిదండ్రుల భద్రతను తగ్గించడాన్ని నిరసిస్తూ తన భద్రతా సిబ్బందిని తేజస్వి వెనక్కి పంపించేశారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు ఉన్న ‘Y+’ సెక్యూరిటీని తొలగించి కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ను మాత్రం కేటాయించారు.
ఈ భద్రత తగ్గింపు వ్యవహారంపై లాలూ మరో కుమార్తె రోహిణి ఆచార్య బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "మా కుటుంబానికి హాని చేయాలనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన మా అమ్మను రాజకీయ కక్షసాధింపుతోనే టార్గెట్ చేస్తున్నారు. ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు" అని రోహిణి మండిపడ్డారు.