‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్‌

Janhvi Kapoor role in Peddi faces criticism Director to change scenes
  • కొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌ శ్రుతి మించిందంటూ విమర్శలు
  • క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌ బుచ్చిబాబు
  • మహిళలను కించపర్చడం తమ ఉద్దేశం కాదని వివరణ
  • భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
'పెద్ది' సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. కానీ, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పాత్రపై మాత్రం ఓ వర్గం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆమెను చూపించిన తీరు బాలేదని, కేవలం గ్లామర్‌ కోసమే ఆమెను సినిమాలో ఉంచారని పెదవి విరుస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో శ్రుతి మించిన గ్లామర్‌ ఒలకబోసినట్లు విమర్శిస్తున్నారు. 

దీంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. సినిమా అనేది ప్రేక్షకులను అలరించడంతో పాటు, వారిని ఆలోచింపజేసేలా, ఒకరితో ఒకరిని అనుసంధానించేలా ఉండాలని.. ఎవరినీ కించపరిచేలా లేదా అసౌకర్యానికి గురిచేసేలా ఉండొద్దని తాను నమ్ముతానని పేర్కొన్నారు. 

పెద్ది సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకులు, మహిళా సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫీడ్‌బ్యాక్‌ను తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉంటుందని తెలిపారు. సినిమాలో ఏ మహిళ పాత్రను కించపరచాలనేది కానీ, తక్కువ చేసి చూపించాలనేది కానీ తమ చిత్ర బృందం ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, సినిమాలో కొన్ని భాగాలు మహిళలను తక్కువ చేసినట్లుగా అనిపించి ఉంటే.. ఆ ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.

ప్రేక్షకుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా సమీక్షించిన తర్వాత, వివాదాస్పదంగా ఉన్న ఆయా సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు బుచ్చిబాబు ప్రకటించారు. ప్రేక్షకులు వల్లే సినిమా ఎదుగుతుందని, కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, వారి సున్నితత్వాలను గమనిస్తూ కథలు చెప్పాల్సిన బాధ్యత కథకుడిగా తనపై ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రతి మహిళ గౌరవానికి, సమాజంలో విలువైన స్థానాన్ని పొందడానికి అర్హురాలని, వారిని ఎప్పుడూ హుందాగా చూపించాలనేదే తమ తాపత్రయమని బుచ్చిబాబు చెప్పారు. భవిష్యత్తులో కూడా బలమైన మహిళా పాత్రలతో కూడిన కథలను, సమాజ విలువలను కాపాడుతూ తెరకెక్కిస్తామని హామీ ఇచ్చారు. తమ సినిమాపై ఎలాంటి దాపరికం లేకుండా, ఎంతో నిజాయతీగా తమ అభిప్రాయాలను, విమర్శలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
Janhvi Kapoor
Buchi Babu
Peddi movie
Peddi movie controversy
Janhvi Kapoor Peddi role
Buchi Babu apology
Telugu cinema news
Peddi movie scenes change
Janhvi Kapoor glamour controversy
Buchi Babu director

More Telugu News