బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు

Exercise Benefits for Heart Health Even Without Weight Loss  AHA Study
  • అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక
  • వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ
  • శారీరక శ్రమతో ఇన్సులిన్‌ నిరోధకతతో తగ్గుదల
  • బాడీ ఫిట్‌నెస్‌ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం
  • వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
గుండె జబ్బులకు స్థూలకాయం ప్రధాన కారణం. అయితే వ్యాయామం చేసినప్పుడు బరువు తగ్గలేదని చాలా మంది నిరాశ చెందుతుంటారు. దీనిపై స్పందించిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గే కోణంలోనే చూడటం తప్పని స్పష్టం చేసింది. బరువులో మార్పు రాకపోయినా, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె పనితీరు, రక్తపోటు, బ్లడ్ షుగర్ లెవల్స్ అద్భుతంగా నియంత్రణలోకి వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోకుండా కేవలం వ్యాయామం మాత్రమే చేయడం వల్ల స్థూలకాయులలో ఆశించినంత బరువు తగ్గకపోవచ్చు. కానీ శారీరక శ్రమ వల్ల గుండె మరింత సమర్థంగా రక్తాన్ని పంప్ చేస్తుంది. అలాగే శరీరంలో ఆక్సిజన్ వినియోగం మెరుగవుతుంది. ఫలితంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. బరువు తగ్గకపోయినా లోపల జరిగే ఈ మార్పులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్థూలకాయం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతుంది. అయితే రోజూ నడవడం, సైక్లింగ్, ఈత కొట్టడం వంటి వ్యాయామాల వల్ల కండరాలు గ్లూకోజ్‌ను సమర్థంగా వాడుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

అందుకే బరువు తగ్గడాన్ని కాకుండా, బాడీ ఫిట్‌నెస్‌ను మాత్రమే ఆరోగ్యానికి కొలమానంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ దూరం నడవగలగడం, సులభంగా మెట్లు ఎక్కగలగడం వంటి మార్పులు కనిపిస్తే మీ గుండె మెరుగవుతున్నట్లే లెక్క. వ్యాయామాన్ని బరువు తగ్గే ఒక తాత్కాలిక వ్యూహంగా కాకుండా జీవితాంతం కొనసాగించే ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడే దీర్ఘకాలిక ఆరోగ్యం సాధ్యమవుతుందని ఏహెచ్‌ఏ స్పష్టం చేసింది.
Go Back to Shorts
exercise benefits

More Telugu News