భారత్ గ్లోబల్ ఐటీ లీడర్.. ఇండియా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై పుతిన్ ప్రశంసలు
- భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు
- భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య
- పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్ లొంగదని పునరుద్ఘాటన
- ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్ కితాబు
- భారత విద్యా ప్రమాణాలూ భేష్ అన్న రష్యా అధ్యక్షుడు
భారతదేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని పుతిన్ ప్రత్యేకంగా కొనియాడారు. సాంకేతిక రంగంలో భారతీయ ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ‘‘భారతదేశ ప్రజలు ఎంత ప్రతిభావంతులో, ఎంతటి విద్యావంతులో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా కోడింగ్ రంగంలో భారతీయులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో ఇండియానే లీడర్’’ అని పుతిన్ పేర్కొన్నారు.
ఇదే వేదికపై భారత వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పుతిన్ అభినందించారు. రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలంటూ అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెచ్చాయని, భారత్ వాటిని తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ లేదా చైనా లాంటి సార్వభౌమాధికారం ఉన్న దేశాలు విదేశాల నుంచి వచ్చే ఎలాంటి ఆదేశాలను ఖాతరు చేయవని, స్వతంత్ర నిర్ణయాధికారమే ఆయా దేశాల బలమని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పుతిన్ కొనియాడారు. ఇది రాత్రికి రాత్రి వచ్చింది కాదని, మోదీ ప్రభుత్వ కష్టానికి నిదర్శనమని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 60 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని త్వరలోనే 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి రష్యా కట్టుబడి ఉందని.. క్లీన్ ఎనర్జీ, ఫార్మా, హైడ్రోకార్బన్ రంగాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.