సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్‌.. ఎవరీ ఝాంగ్‌ యిమింగ్‌?

  • 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్‌ యిమింగ్‌
  • టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు
  • చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్‌
  • దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్‌
  • ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
సంపదలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీని చైనాకు చెందిన ‘టిక్‌టాక్’ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. జాంగ్ నికర ఆస్తి విలువ 92.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ముకేశ్ అంబానీ (86.9 బిలియన్ డాలర్లు) మూడో స్థానానికి పడిపోయారు. ఝాంగ్ ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా, చైనాలోనే నంబర్-1 కుబేరుడిగా అవతరించారు. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ (117.4 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో జన్మించిన 43 ఏళ్ల ఝాంగ్ యిమింగ్.. నాంకై విశ్వవిద్యాలయం నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆరంభంలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన ఆయన 2012లో బీజింగ్‌లోని ఓ చిన్న అపార్ట్‌మెంట్ రూమ్ నుంచి ‘బైట్‌డ్యాన్స్’ కంపెనీని ప్రారంభించారు. కేవలం సంప్రదాయ ఎడిటర్ల సాయం లేకుండా అల్గారిథమ్స్ ఆధారంగా యూజర్లకు నచ్చిన కంటెంట్‌ను అందించే ‘టౌటియావో’ అనే న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించారు. ఆ తర్వాత ఆయన తెచ్చిన షార్ట్ వీడియో యాప్ ‘టిక్‌టాక్’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా యూజర్లతో సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం టిక్‌టాక్ సక్సెస్‌తో పాటు, బైట్‌డ్యాన్స్ రూపొందించిన ‘దౌబావో’ అనే ఏఐ చాట్‌బాట్ చైనాలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. బ్లాక్‌రాక్, ఫిడిలిటీ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బైట్‌డ్యాన్స్ విలువను భారీగా పెంచడంతో ఝాంగ్ సంపద ఒకేసారి 24 బిలియన్ డాలర్లు పెరిగింది. ఒకప్పుడు చమురు, రియల్ ఎస్టేట్ రంగాలు కుబేరులను సృష్టిస్తే.. ఈ ఏఐ యుగంలో కేవలం ఒక కోడింగ్ అల్గారిథమ్‌తో ప్రపంచాన్నే శాసించవచ్చని ఝాంగ్ యిమింగ్ నిరూపించారు.

Zhang Yiming
ByteDance
TikTok founder
Mukesh Ambani
Bloomberg Billionaires Index
Asia richest person
Gautam Adani
China richest man
Doubao AI chatbot
Tech billionaires

More Telugu News