ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్

  • గతంతో పోలిస్తే భారత్ లో అవినీతి గణనీయంగా తగ్గిందన్న థ్రన్
  • అయితే ఏఐ సామర్థ్యాల్లో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని స్పష్టీకరణ
  • భారతదేశం సరైన మార్గంలోనే పయనిస్తోందని కితాబు
భారతదేశం అద్భుతమైన పరివర్తన దిశగా పయనిస్తోందని, గతంతో పోలిస్తే అవినీతి గణనీయంగా తగ్గిందని గూగుల్ ఎక్స్ (Google X) సహ వ్యవస్థాపకుడు సెబాస్టియన్ థ్రన్ ప్రశంసించారు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాల విషయంలో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ ఇంకా చాలా వెనుకబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన 'సౌత్ సమ్మిట్ 2026' సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా థ్రన్ మాట్లాడుతూ, "భారతదేశం ప్రస్తుతం గొప్ప మార్పుల దశలో ఉంది. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే దేశంలో అవినీతి తగ్గింది. ప్రపంచ మార్కెట్‌లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరిగింది" అని అన్నారు. విద్య, పెట్టుబడుల లభ్యత, వ్యాపారాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలలో భారీ మెరుగుదల కనిపిస్తోందని, దేశం సరైన మార్గంలోనే పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, ఏఐ రంగంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ప్రస్తావించారు. "ఏఐ సామర్థ్యాల విషయంలో అమెరికా, చైనాకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు. విద్య, మూలధనం, పాలన, అవినీతి నిరోధం, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక అంశాలు కలిసి పనిచేసినప్పుడే అమెరికా వంటి దేశాలతో పోటీపడగలరు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం" అని ఆయన విశ్లేషించారు. డీప్‌ఫేక్‌లు, ఫేక్ న్యూస్‌లను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని కూడా థ్రన్ నొక్కిచెప్పారు.

Sebastian Thrun
Google X
India
AI
USA
China

More Telugu News