ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

Iran War Impact India Planning to Remove Capital Gains Tax on FPI GSec Investments
  • ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం చర్యలు
  • ప్రభుత్వ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేసే యోచన
  • ఆదాయపు పన్ను చట్ట సవరణకు ఆర్డినెన్స్ తెస్తున్నట్లు సమాచారం
  • స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు
ఇరాన్ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లు సమాచారం.

ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను చెల్లిస్తున్నారు. 12 నెలల కంటే ఎక్కువ కాలం అట్టిపెట్టుకునే బాండ్లు, లిస్టెడ్ షేర్లపై ఈ పన్ను విధిస్తారు.

దీనికి తోడు ప్రభుత్వ బాండ్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్‌హోల్డింగ్ పన్ను కడుతున్నారు. గతంలో దీనిపై ఉన్న 5 శాతం రాయితీ రేటును 2023 లోనే కేంద్రం తొలగించింది. అయినా ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలను అడ్డుకునేందుకు పన్ను కోతలు విధించాలనే డిమాండ్లు వచ్చాయి.

దేశ విదేశీ మారక నిల్వలను మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్తులో మరికొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని అధికారిక వర్గాలు అంటున్నాయి. మూలధన లాభాలపై పన్నులను తగ్గించడం గురించి ఇన్వెస్టర్ల అభిప్రాయాలను వినడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఆమె ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
Go Back to Shorts
Foreign portfolio investors
Capital gains tax exemption
Indian government securities
Union Cabinet ordinance
Narendra Modi government
Nirmala Sitharaman
budget
Modi

More Telugu News