క్రికెటర్ కాకముందు పాస్‌పోర్ట్ ఏజెంట్, కార్ బ్రోకర్.. కృనాల్ పాండ్యా గతం ఇదే!
- ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యా కెరీర్ ఆరంభంపై సంచలన విషయాల వెల్లడి
- చిన్నతనంలో తండ్రితో కలిసి పాస్‌పోర్ట్ ఏజెంట్‌గా, సెకండ్ హ్యాండ్ కార్ బ్రోకర్‌గా పనిచేసిన వైనం
- ఒక్కో కార్ డీల్‌పై రూ. 3 వేల కమీషన్ కోసం పేపర్‌వర్క్ చేసిన కృనాల్
- ఐపీఎల్ 2026లో 226 పరుగులు, 14 వికెట్లతో కీలక పాత్ర
- నాటి పేదరికమే మైదానంలో పోరాడే తత్వాన్ని, గెలిచే కసిని నేర్పిందన్న కృనాల్
ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా మారిన కృనాల్ పాండ్యా, ఈ 2026 సీజన్ లో 145.80 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు చేయడమే కాకుండా, 16 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి జట్టు టైటిల్‌ను కాపాడుకోవడంలో (Title Defence) వెన్నెముకలా నిలిచాడు. ఈ సక్సెస్ అనంతరం తన గతాన్ని గుర్తుచేసుకుంటూ.. "నాకు 11 లేదా 12 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న హిమాన్షు పాండ్యాతో కలిసి పని చేయడం ప్రారంభించాను. మా నాన్న పాస్‌పోర్ట్ అడ్వైజర్ ఏజెంట్. నేను కూడా స్వయంగా పాస్‌పోర్ట్ ఏజెంట్‌గా మారాను. ఆ సమయంలో ప్రజల కోసం రేషన్ కార్డులు తయారు చేసేవాడిని" అని కృణాల్ తెలిపాడు.
పాస్‌పోర్ట్ పనులే కాకుండా ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ కార్ల బ్రోకరేజ్ వ్యాపారంలోకి కూడా దిగినట్లు కృనాల్ వెల్లడించాడు. సాధారణంగా రూ. 3 నుంచి 4 లక్షల విలువైన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను పూర్తి చేస్తే.. ఒక్కో డీల్‌పై తనకు కేవలం రూ. 3,000 కమీషన్ వచ్చేదని చెప్పాడు. ఇందుకోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం, కోర్టు అఫిడవిట్లు సిద్ధం చేయడం, పేర్ల సవరణల కోసం వార్తాపత్రిక కార్యాలయాలకు వెళ్లడం వంటి అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ పనులను తానే స్వయంగా చూసుకునేవాడినని గుర్తుచేసుకున్నాడు.
చిన్న వయసులోనే జీవితాన్ని చాలా దగ్గరగా, కష్టాల మధ్య చూడటం వల్లే.. ఇప్పుడు క్రికెట్ మైదానంలో ఎంతటి కఠినమైన పరిస్థితి ఎదురైనా తాను అస్సలు లొంగిపోనని కృనాల్ ధీమా వ్యక్తం చేశాడు. "మనం జీవితాన్ని ఎలా జీవిస్తామో.. ఆటను కూడా అలాగే ఆడతాం. మ్యాచ్ క్లిష్టంగా మారినప్పుడు 'నేను ఎలాగైనా గెలవాలి' అనే కసి నాలో పెరుగుతుంది. ఆ పట్టుదల నాకు నా చిన్ననాటి కష్టాల నుంచే వచ్చింది" అని వివరించాడు. తండ్రిని కోల్పోయిన తర్వాత, నాటి రోజులను తలచుకుంటూ మైదానంలో ఒత్తిడిని భారంలా కాకుండా ఒక అవకాశంగా మార్చుకుంటున్నానని కృనాల్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అభిమానుల గుండెలను పిండేస్తున్నాయి.