ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్!

  • ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్
  • ఆండ్రాయిడ్‌లో 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ
  • నకిలీ కాల్ అని అనుమానం వస్తే వెంటనే యూజర్‌కు హెచ్చరిక
  • మొదట పిక్సెల్ ఫోన్లకు, తర్వాత ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి గొంతును కాపీ చేసి (వాయిస్ క్లోనింగ్) చేస్తున్న మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్ల కోసం 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా ఏఐ వాయిస్ స్కామ్‌ల నుంచి యూజర్లకు మరింత రక్షణ లభించనుంది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఈ ఫీచర్ రియల్ టైమ్‌లో పనిచేస్తుంది. మీ ఫోన్‌లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుడు, నిజంగా ఆ వ్యక్తి డివైజ్ నుంచే కాల్ వస్తుందో లేదో ఇది తెర వెనుక పరిశీలిస్తుంది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) టెక్నాలజీ ద్వారా ఒక సైలెంట్ సిగ్నల్ పంపడం ద్వారా దీనిని నిర్ధారించుకుంటుంది. ఒకవేళ ఎవరైనా మోసగాడు మీ బంధువుల నంబర్‌ను స్పూఫ్ చేసి, ఏఐతో వారి గొంతును అనుకరించి కాల్ చేసినా ఈ ఫీచర్ పసిగడుతుంది. "ఈ కాల్ బహుశా ఆ వ్యక్తి [కాంటాక్ట్ పేరు] నుంచి కాకపోవచ్చు" అంటూ స్క్రీన్‌పై హెచ్చరిక చూపిస్తుంది. వెంటనే కాల్ కట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది.

పెరుగుతున్న ఏఐ స్కాముల ముప్పు

ప్రస్తుతం ఏఐ వాయిస్ క్లోనింగ్ ఉపయోగించి చేసే మోసాలు విపరీతంగా పెరిగాయి. కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నట్లు నమ్మించి డబ్బులు గుంజడం వంటి స్కాములు ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని కలిగిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ తీసుకువచ్చిన ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
 
ఈ ఫీచర్ పనిచేయాలంటే కాల్ చేసేవారు, స్వీకరించేవారు ఇద్దరూ 'ఫోన్ బై గూగుల్', గూగుల్ మెసేజెస్, గూగుల్ కాంటాక్ట్స్ యాప్‌లను డీఫాల్ట్‌ గా ఉపయోగించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఇది పనిచేస్తుంది. మొదటగా పిక్సెల్ ఫోన్లలో, ఈ నెల నుంచే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
 

Business News
google
AI
Fake Call Detection
AI Voice Cloning Scams

More Telugu News