సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు?
- నేడు ఆన్‌లైన్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం
- టీ20 కెప్టెన్సీ మార్పుపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ
- ఐపీఎల్ 2026లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్
- భవిష్యత్తు రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్
- ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక
2024లో రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత సూర్యకుమార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొంటున్న సుదీర్ఘ ఫామ్ లేమి (Lean patch) ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్య.. 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి వైఫల్యం వల్ల ఐపీఎల్‌లో ముంబై 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ, అలాగే ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లోనూ సూర్య బ్యాట్‌తో ఘోరంగా తడబడ్డాడు.
ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు అనివార్యమైతే సూర్యకుమార్ వారసుడిగా ఎవరు వస్తారనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఈ రేసులో ముందంజలో ఉండగా.. సంజూ శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్‌లు కూడా 'డార్క్ హార్స్' (అంచనాలకు అందకుండా రేసులోకి రావడం) లా మారే అవకాశం ఉంది. ఈ నెల 26, 28 తేదీల్లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. దీని కోసం జూన్ మధ్య వారంలో జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్, జింబాబ్వే పర్యటనలు ఉన్న నేపథ్యంలో.. ఈ గురువారం జరిగే బోర్డు సమావేశం టీమిండియా భవిష్యత్తు టీ20 ప్రణాళికలకు అత్యంత కీలకం కానుంది.