నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద

  • నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన ప్రజ్ఞానంద
  • ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌పై క్లాసికల్ గేమ్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్
  • ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద
  • ఓటమితో కార్ల్‌సన్ ఎనిమిదో టైటిల్ ఆశలు దాదాపు గల్లంతు
ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. నిన్న‌ జరిగిన క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ నెంబర్ 1, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించాడు. ఇదే టోర్నీలో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకు ఇది రెండో గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో ఒకే టోర్నీలో క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.

ఆట ముగిసిన తర్వాత కార్ల్‌సన్ తీవ్ర నిరాశతో కనిపించాడు. ప్రజ్ఞానందతో కరచాలనం చేసిన వెంటనే, ఓటమిని జీర్ణించుకోలేక తల అడ్డంగా ఊపుతూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో టోర్నీలో మూడో స్థానానికి ఎగబాకాడు. దీంతో నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకునే తొలి భారతీయుడిగా నిలవాలన్న అతని ఆశలు మరింత బలపడ్డాయి. మరోవైపు ఈ ఓటమి ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకుంటున్న కార్ల్‌సన్ ఆశలపై నీళ్లు చల్లింది.

ఇక, రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్ల్‌సన్ టైటిల్ నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ టోర్నీలో కార్ల్‌సన్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటివరకు అతను నాలుగు క్లాసికల్ గేమ్‌లలో ఓడిపోగా, అందులో రెండుసార్లు ప్రజ్ఞానంద చేతిలోనే పరాజయం పాలయ్యాడు.

మరోవైపు టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్, మరో భారత ఆటగాడు డి. గుకేశ్‌పై ఫిరౌజా విజయం సాధించాడు. ఈ ఓటమితో గుకేశ్ (8 పాయింట్లు) టైటిల్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించాడు.

ఏదేమైనా కార్ల్‌సన్‌పై వరుస విజయాలతో ప్రజ్ఞానంద టైటిల్ రేసులో బలంగా నిలిచాడు. రాబోయే రెండు రౌండ్ల ఫలితాలు టోర్నీ విజేతను నిర్ణయించనున్నాయి. సొంతగడ్డపైనే వరుస ఓటములతో కార్ల్‌సన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.

R Praggnanadhaa
Magnus Carlsen
Norway Chess

More Telugu News