లాటరైట్‌కు 'సేవింగ్ క్లాజ్' ఇవ్వండి... కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ

  • లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
  • కొత్త నిబంధనలతో ఏపీలో 402 గనుల లీజుల ప్రక్రియ నిలిపివేత
  • పాత దరఖాస్తులకు 'సేవింగ్ క్లాజ్' కింద రెండేళ్ల వెసులుబాటుకు విజ్ఞప్తి
  • పరిశ్రమలకు ముడిసరుకు, ఉపాధి నిలబెట్టాలని లేఖలో స్పష్టీకరణ
లాటరైట్ ఖనిజం వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రాష్ట్రంలో తలెత్తిన ఇబ్బందులను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న గనుల లీజు దరఖాస్తుల విషయంలో వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు.

లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్‌గా (మేజర్ మినరల్) పరిగణించాలని కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏపీలో గనుల లీజుల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల వల్ల, మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేస్తున్న 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నిలిచిపోయిన వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్, 113 ప్రభుత్వ భూములు, 255 అటవీ భూములు, 15 పట్టా భూములకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని వివరించారు.

పాత నిబంధనల ప్రకారమే వందలాది మంది దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. గతంలో మైకా, క్వార్ట్జ్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ కేటగిరీకి మార్చినప్పుడు కేంద్రం 'సేవింగ్ క్లాజ్' ఇచ్చిందని గుర్తుచేశారు. అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ వర్తింపజేసి, పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే ప్రాసెస్ చేయడానికి రెండేళ్ల పాటు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సడలింపు ఇస్తే దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం జరగదని, న్యాయపరమైన వివాదాలు నివారించవచ్చని తెలిపారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి అవకాశాలు నిలబడతాయని చంద్రబాబు తన లేఖలో స్పష్టం చేశారు.

Chandrababu
Kishan Reddy
TDP
BJP
Andhra Pradesh

More Telugu News