సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్‌

  • ఫైళ్ల దొంగతనం కోసం లక్ష సార్లు యత్నించినట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడి.
  • దాడులు జరిగినా పోర్టల్ నార్మల్‌గా పనిచేసిందని ప్రకటన
  • మధ్యాహ్నానికి 18 వేల దరఖాస్తులు పూర్తయ్యాయని వెల్లడి
  • సర్వర్లను టెక్నికల్ టీమ్ నిరంతరం గమనిస్తోందని హామీ
సీబీఎస్‌ఈ వెబ్‌పోర్టల్‌పై హ్యాకర్లు భారీ సైబర్ దాడికి తెగబడ్డారు. విద్యార్థుల రీ-ఎవాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే ఈ ఘటన జరిగింది. అయితే ఈ దాడులను తిప్పికొడుతూ పోర్టల్ ఆగకుండా పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి వెబ్‌సైట్ యథావిధిగా సేవలందిస్తోందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

రెండు నిమిషాల్లో ముప్పేట దాడి
ఈ సైబర్ దాడికి సంబంధించిన వివరాలను సీబీఎస్‌ఈ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. హ్యాకర్లు ఒకేసారి పెద్ద ఎత్తున ‘డినైల్ ఆఫ్ సర్వీస్’ దాడికి ఒడిగట్టారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 15 లక్షల హిట్స్‌తో పోర్టల్‌ను ముంచెత్తారు. దీనితో పాటు సిస్టమ్‌లో భద్రపరిచిన ఫైళ్లను దొంగిలించడానికి ఒక లక్షకు పైగా అనధికారిక ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు గుర్తించింది. సాధారణంగా ఒకేసారి ఇన్ని లక్షల హిట్స్ వస్తే వెబ్‌సైట్ సర్వర్లు తట్టుకోలేక క్రాష్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

పక్కాగా పనిచేసిన సాంకేతికత
వేలాది మంది విద్యార్థులు పోర్టల్‌ను వాడుతున్న సమయంలో హ్యాకర్లు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారని బోర్డు పేర్కొంది. అయినప్పటికీ తమ సర్వర్లు ఈ భారీ ట్రాఫిక్‌ను సమర్థంతంగా తట్టుకున్నాయని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఒకేసారి 8 వేల మందికి పైగా వినియోగదారులు సైట్‌ను ఉపయోగించారని, అలాగే 18 వేల కంటే ఎక్కువ విజయవంతమైన రీ-ఎవాల్యుయేషన్ దరఖాస్తులు నమోదయ్యాయని బోర్డు వివరించింది.

విద్యార్థుల కోసం మార్పులు
విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈసారి పోర్టల్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. అప్లికేషన్ ప్రక్రియ సులువుగా సాగడానికి సెషన్ సమయ పరిమితిని పెంచినట్లు చెప్పింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతిక బృందాలు నిరంతరం వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్నాయని, భద్రతా చర్యలు తీసుకుంటున్నాయని బోర్డు భరోసా ఇచ్చింది.

Cyberattack
CBSE
Reevaluation
CBSE Portal

More Telugu News