భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్'
- భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్
- ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు
- కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు
- పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
- వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు
మే 29న భారత్‌లో విడుదలైన ఈ సినిమా, ఐదో రోజైన మంగళవారం మధ్యాహ్నానికి రూ. 36 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తం నెట్ కలెక్షన్ రూ. 10.11 కోట్లకు, గ్రాస్ రూ. 12.10 కోట్లకు చేరింది. పాజిటివ్ మౌత్ టాక్‌తో వారాంతంలో భారీ వృద్ధిని కనబరిచింది. శుక్రవారం రూ.1.75 కోట్లు, శనివారం రూ.2.75 కోట్లు, ఆదివారం రూ.3.25 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా సుమారు 577 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి హైదరాబాద్‌లో 57 శాతం ఆక్యుపెన్సీ ఉండటం విశేషం.
అంతర్జాతీయంగా కూడా 'అబ్సెషన్' అద్భుతమైన ఫలితాలను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, అందులో 100 మిలియన్ డాలర్లకు పైగా ఒక్క ఉత్తర అమెరికా నుంచే రావడం గమనార్హం. సాధారణంగా సినిమాల వసూళ్లు వారం వారం తగ్గుముఖం పడతాయి. కానీ ఈ సినిమాకు రెండో, మూడో వారాంతాల్లో కలెక్షన్లు మరింత పెరిగాయి. ఇది హారర్ చిత్రాల చరిత్రలో చాలా అరుదైన రికార్డుగా నిలిచింది.
యూట్యూబర్‌గా పేరుగాంచిన 26 ఏళ్ల కర్రీ బార్కర్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే ప్రధాన పాత్రల్లో నటించారు. తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఒక యువకుడు అతీంద్రియ శక్తిని ఉపయోగించడం, ఆ తర్వాత వారి ప్రేమ ఒక పీడకలగా ఎలా మారిందనేదే ఈ సినిమా కథ. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినా, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ 'అబ్సెషన్' బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది.