భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ
- అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తత
- ఈ వైరస్‌కు టీకాలు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలని సూచించింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాలని సూచించింది.
జ్వరం, తీవ్రమైన బలహీనత, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు లేదా కారణం లేకుండా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. ముందస్తు సమాచారంతో మీ ప్రాణాలను కాపాడుకోవడంతోపాటు వ్యాధి వ్యాప్తిని కూడా నిరోధించవచ్చని తెలిపింది. అధికారుల సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1075కు కాల్ చేయాలని సూచించింది.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో కొత్త రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మే 17న దీనిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ ప్రత్యేక వైరస్‌కు ప్రస్తుతం ఆమోదిత టీకాలు లేదా నిర్దిష్ట చికిత్సలు అందుబాటులో లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెంచుతోంది.
భారత్ తీసుకుంటున్న చర్యలు
ఈ పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. డీఆర్సీ, ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని పౌరులకు సూచించింది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేసింది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్పోర్ట్ ఆరోగ్య అధికారులకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో ఎలాంటి కేసులు లేనప్పటికీ, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.