రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ రెడ్డి

  • పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
  • ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్‌ రెడ్డి
  • అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని హర్షం
  • 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని వెల్లడి
  • 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం
ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలన్నది తన కల అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. దానికి తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంటే మార్గమని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దీనికి ప్రజల అండదండలు, సహకారం కావాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయన, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పై అభిమానం చూపారని సీఎం రేవంత్‌ తెలిపారు. ఈ ఆదరణ తమ ప్రభుత్వంపై మరింత బాధ్యతను మోపిందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని తరహాలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాచరిక ఆలోచనలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని వ్యాఖ్యానించారు. 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. 2047 విధాన పత్రంలో రైతులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2.36 కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం గర్వకారణమన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల నుంచి చివరి గింజ వరకూ కొంటామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. 

తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వేదికల్లో పోరాడుతున్నామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు తిరిగి ప్రాణం పోస్తున్నామని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.లక్ష కోట్ల రుణాలిస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు రూ.10 వేల కోట్ల విలువైన ప్రయాణాలు సాగించారన్నారు. 

తెలంగాణ సాధన కోసం నిరుద్యోగ యువత పోరాటం చేసిందని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు పేదల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో తనకు తెలుసని తెలిపారు. అందుకే ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.20,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. ఈ ఏడాది మూడున్న లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

Revanth Reddy
Telangana
CM Revanth Reddy
Congress

More Telugu News