ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే!: కోచ్ ఆండీ ఫ్లవర్
- 2025, 2026 టైటిళ్ల మధ్య తేడాను వివరించిన కోచ్ ఆండీ ఫ్లవర్
- గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో ఆత్మవిశ్వాసం ఎక్కువని వెల్లడి
- విరాట్, భువనేశ్వర్ వంటి సీనియర్లు ఉండటం తమకు పెద్ద బలమన్న ఫ్లవర్
- ఆడని ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య
- వెంకటేశ్ అయ్యర్ ఓ గొప్ప ఉదాహరణ అని ప్రశంసలు
"2025, 2026 టైటిల్ విజయాల మధ్య కచ్చితంగా తేడాలు ఉన్నాయి. అయితే నేను 2024 సీజన్‌ను కూడా గుర్తుచేసుకోవాలి. ఆ ఏడాది తొలి అర్ధభాగంలో ఎదురైన పరాజయాలు మాలో పట్టుదలను పెంచాయి. వ్యూహాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవడానికి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ పరిస్థితులే కారణం" అని ఫ్లవర్ తెలిపాడు.
ఫ్లవర్ ఇంకా వివరిస్తూ, "2025లో తొలిసారి టైటిల్ గెలిచాం. అయితే, ఆర్సీబీకి గతంలో టైటిల్ గెలిచిన అనుభవం లేకపోవడంతో ఆ సీజన్ లో చాలా ఒత్తిడి, అనిశ్చితి ఉండేవి. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది టైటిల్ గెలిచిన తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం కోచింగ్ సిబ్బందిగా మా పనిని సులభతరం చేసింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లేటప్పుడు వారిలో కనిపించిన ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపించింది" అని అన్నాడు.
జట్టు సంస్కృతే విజయానికి పునాది
జట్టులో ఆడే అవకాశం రాని ఆటగాళ్లను కూడా ప్రోత్సహించడం, వారిలో స్ఫూర్తి నింపడం తమ విజయానికి కీలకమని ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు. "ఒక జట్టులో యువకులు, అనుభవజ్ఞులు, వివిధ దేశాల ఆటగాళ్లు ఉంటారు. అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం పెద్ద సవాల్. ఆడని ఆటగాళ్లకు కూడా తాము ఎదుగుతున్నామనే భావన కలిగించాలి. వారికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. అండర్-19 ప్రపంచకప్ నుంచి వచ్చిన విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్ వంటి యువ ఆటగాళ్లు విరాట్ వంటి సీనియర్లను చూసి ఎంతో నేర్చుకున్నారు" అని వివరించాడు.
ఈ విషయంలో వెంకటేశ్ అయ్యర్ అత్యుత్తమ ఉదాహరణ అని ఫ్లవర్ ప్రశంసించారు. "వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున ఆడి, ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అనుభవం ఉన్నా, జట్టు కూర్పు ప్రకారం కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా అతను ఓపికతో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ గాయంతో దూరమైనప్పుడు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కీలక పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. సిద్ధంగా ఉండటం అంటే ఏమిటో అతను నిరూపించాడు" అని కొనియాడాడు.
సీనియర్ల పాత్రపై మాట్లాడుతూ, "విరాట్, భువీ, హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటారు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లు లేదా యాషెస్ వంటి పెద్ద టోర్నీలలో ఆడిన అనుభవం వారికి ఉంది. వారి ప్రశాంతత జట్టు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ముఖ్యంగా గత రెండు సీజన్లలో భువనేశ్వర్ ఒత్తిడిలో అద్భుత ప్రదర్శనలు చేయకపోయి ఉంటే, మాకు ఈ విజయాలు దక్కేవి కావు. ఈ ఆత్మవిశ్వాసాన్ని వచ్చే సీజన్లో కూడా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఫ్లవర్ ముగించాడు.