పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు!

  • ఆన్‌లైన్ సంస్కృతి వల్ల పిల్లల్లో తగ్గుతున్న ఓపిక
  • చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అవసరం
  • నచ్చిన వస్తువును లక్ష్యంగా పెట్టి పొదుపు నేర్పాలి
  • నిత్యావసరాలు, విలాసాల మధ్య తేడాను వివరించాలి
  • పాకెట్ మనీని పొదుపు పాఠంగా మార్చడం ఉత్తమం
ఆన్‌లైన్ షాపింగ్, ఇన్‌స్టంట్‌ డెలివరీల పుణ్యమా అని ఈరోజుల్లో ఒకే ఒక్క క్లిక్‌తో కావాల్సిన వస్తువు ఇంటి ముందుకు వచ్చేస్తోంది. ఈ కాలంలో పెద్దలకే కాదు.. పిల్లలకూ ఓపిక నశిస్తోంది. అడిగిన వెంటనే వస్తువు చేతికి దొరుకుతుండటంతో, భవిష్యత్తు కోసం దాచుకోవడం లేదా ఒక లక్ష్యం కోసం వేచి చూడటం వంటి విషయాలను పిల్లలు అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో అనవసర ఖర్చుల వైపు నడిపి ఆర్థికంగా బలహీనపరుస్తుంది.

అందుకే చిన్నతనం నుంచే పిల్లలకు డబ్బు విలువ, పొదుపు చేయడం నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది వారి భవిష్యత్ కెరీర్‌కు, జీవితానికి ఎంతో సాయపడుతుంది. పిల్లల్లో ఆ అలవాట్లను పెంచడానికి 4 సులువైన మార్గాలు ఇవే..

1. ఒక లక్ష్యాన్ని నిర్దేశించండి.
పిల్లలకు ఊరికే ‘డబ్బులు దాచుకో’ అని చెబితే వారికి పెద్దగా ఆసక్తి ఉండదు. దానికి బదులు వారికి నచ్చిన సైకిల్ లేదా ఒక బొమ్మ లాంటి నిర్దిష్టమైన లక్ష్యాన్ని వారి ముందుంచాలి. తాము దాచుకునే డబ్బుతో ఆ వస్తువును సొంతం చేసుకోవచ్చనే ఆలోచన వారిలో పొదుపుపై గట్టి ప్రేరణ కలిగిస్తుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. పిల్లల ‘అవసరాల’ కోసం కాకుండా వారి ‘కోరికల’ కోసం వారి చేత డబ్బులు దాచేలా చేయాలి.

2. ‘అవసరం’.. ‘ఆశ’ల మధ్య తేడా
జీవితంలో డబ్బును సరిగా నిర్వహించాలంటే ‘అవసరం’ ఏంటి? ‘ఆశ/కోరిక’ ఏంటి? అనే తేడా తెలియడం చాలా ముఖ్యం. రోజువారీ జీవితానికి కచ్చితంగా కావాల్సినవి అవసరాలు, అవి లేకపోయినా నడుస్తుంది కానీ ఉంటే సంతోషాన్ని ఇస్తాయి అనుకునేవి కోరికలు. మీరు పిల్లలను కిరాణా షాపునకో లేదా సూపర్ మార్కెట్‌కో తీసుకెళ్లినప్పుడు దీనిపై ప్రాక్టికల్‌గా నేర్పించవచ్చు. అక్కడ ఉండే వస్తువులను చూపిస్తూ ‘‘ఇంట్లోకి పాలు, కూరగాయలు ఈరోజే ఎందుకు కొనాలి? చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు ఈరోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా ఎందుకు కొనవచ్చు?’’ అని వారినే ప్రశ్నించాలి. దీనివల్ల పిల్లలకు డబ్బు విలువ అర్థమవుతుంది.

3. పాకెట్ మనీ ఒక పాఠం
పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం అనేది కేవలం వారు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే కాకుండా, అదొక మంచి లైఫ్ స్కిల్ నేర్చుకునేలా ఉపయోగపడాలి. తమకు వచ్చిన పాకెట్ మనీతో వారు సొంతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చేయాలి. వారికి ఇచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఖర్చుల కోసం, మరికొంత భాగాన్ని దాచుకోవడానికి విడిగా ఉంచేలా అలవాటు చేయాలి. చిన్న వయసులోనే ఈ అలవాటు పడితే పెద్దయ్యాక వారు డబ్బును చాలా పొదుపుగా వాడుకుంటారు.

4. ఖర్చు పెట్టే ముందే ‘పొదుపు’ 
చాలామంది డబ్బులు రాగానే ముందు ఖర్చు పెట్టి మిగిలితే దాచుకుంటారు. కానీ మొదట పొదుపు చేసి, ఆ తర్వాతే ఖర్చు పెట్టాలనే సూత్రాన్ని పిల్లలకు నేర్పాలి. పండుగలు, పుట్టినరోజులకు బంధువులు ఇచ్చే కానుకల నగదు, రివార్డులు, పాకెట్ మనీల నుంచి కొంత భాగాన్ని ముందే పక్కన పెట్టేలా ప్రోత్సహించాలి. కాలక్రమేణా ఆ డబ్బు పెరగడం చూసి చిన్న ప్రయత్నాలే భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతాయనే ఓపిక, క్రమశిక్షణ వారిలో అలవడుతాయి.

Kids Savings
Saving Money
Financial Literacy
Pocket Money
Kids Finance
Parenting Tips
Child Development
Financial Planning

More Telugu News