ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి

BJP MLA Deepesh Sahu Marries in Mass Wedding Ceremony
  • సామూహిక వివాహాల్లో వివాహమాడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే
  • పేద కుటుంబానికి చెందిన యువతితో ఎమ్మెల్యే వివాహం
  • ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి
  • ఎమ్మెల్యే నిర్ణయాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద జరిగిన సామూహిక వివాహ వేడుకలో ఆయన పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. బెమెతారా నియోజకవర్గ ఎమ్మెల్యే దీపేశ్ సాహు, తరుణా సాహు అనే యువతిని ఆదివారం వివాహం చేసుకున్నారు.

బెమెతారాలో జరిగిన ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో మరో 20 జంటలతో కలిసి 35 ఏళ్ల దీపేశ్, తరుణా సాహు ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకలో ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో స్థానిక సంప్రదాయం ప్రకారం స్వయంగా వరుడిని ఎడ్లబండిపై ఊరేగింపుతో తీసుకువచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఎమ్మెల్యే నిర్ణయంపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రశంసలు కురిపించారు. ఇది సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అయితే, పేదల కోసం ఉద్దేశించిన పథకాన్ని ఎమ్మెల్యే ఉపయోగించుకోవడంపై కాంగ్రెస్ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాహం అనంతరం, బెమెతరా జిల్లా అభివృద్ధికి రూ. 105 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సీఎం ప్రకటించడం విశేషం.
Go Back to Shorts
Deepesh Sahu
Chhattisgarh
Mukhya Mantri Kanya Vivah Yojana
mass wedding

More Telugu News