వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ.. కానీ వేడుకలకు బ్రేక్.. కారణమిదే!

  • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ
  • వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన మూడో జట్టుగా రికార్డు
  • గత ఏడాది తొక్కిసలాట, భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీ రద్దు
  • కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫ్రాంచైజీ నిర్ణయం
  • ఆర్సీబీని అభినందిస్తూ విజ‌య్‌ మాల్యా ట్వీట్‌
ఐపీఎల్ 2026 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. 

అయితే, టైటిల్ విజయాన్ని జట్టుతో కలిసి సంబరాలు చేసుకోవాలనుకున్న అభిమానులకు ఫ్రాంచైజీ యాజమాన్యం నిరాశ కలిగించింది. బెంగళూరులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన విజయోత్సవ ర్యాలీలో అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, ప్రాణనష్టం సంభవించింది. అలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈసారి ర్యాలీని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

దీనికితోడు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం కూడా అదే సమయంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో, పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో భారీ కార్యక్రమమైన ఆర్సీబీ ర్యాలీకి భద్రత కల్పించడం పోలీసులకు కష్టసాధ్యమవుతుంది. నగర వీధుల్లో బహిరంగ వేడుకలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్‌కు కట్టుబడి ఉండాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ కారణాల దృష్ట్యా, భద్రతకు పెద్ద పీట వేస్తూ విజయోత్సవ ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. 
ఈ చారిత్రాత్మక విజయంపై ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఆర్సీబీ.. ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచినందుకు అభినందనలు. మా సింహాలు గట్టిగా గర్జించి మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వెల్ డన్" అంటూ 'ఎక్స్'లో తన ఆనందాన్ని పంచుకున్నారు. 

RCB
Royal Challengers Bangalore
IPL 2026
Gujarat Titans
Vijay Mallya
DK Shivakumar
Narendra Modi Stadium
Ahmedabad

More Telugu News