పదేళ్లు ‘సిప్‌’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే!

  • పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు
  • మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు
  • భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం
  • తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి
  • ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి
‘‘నెలకు కొన్ని రూ.వేలు పెట్టుబడి పెట్టండి.. పదేళ్లలో కోటీశ్వరులు అయిపోండి’’ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు, ఎస్‌ఐపీ (సిప్‌) కాలిక్యులేటర్లు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ‘‘ఎస్‌ఐపీనే మన ఫ్యూచర్’’ అని స్నేహితులు చెబుతుంటే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా దీనికి భారీ ఎలివేషన్లు ఇస్తుంటారు. అయితే పదేళ్ల పాటు సిప్ చేస్తే నిజంగానే అంత ధనవంతులు అయిపోతారా? లేక దీని వెనుక మనం గమనించని సవాళ్లు ఉన్నాయా? ఈ విషయంపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

మ్యాజిక్ ఫార్ములా కాదు
ఈక్విటీ మార్కెట్లలో పదేళ్ల పాటు సిప్‌ చేయడం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. కానీ అది కచ్చితమైన గ్యారెంటీ మాత్రం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. మార్కెట్లు ఎప్పుడూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడుస్తుంటాయి. ఎస్‌ఐపీలో పెట్టుబడిదారులకు కలిసివచ్చే అతిపెద్ద అంశం ‘రూపీ కాస్ట్ యావరేజింగ్’. అంటే మార్కెట్ పడినప్పుడు ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు అవుతుంటాయి. దీనివల్ల దీర్ఘకాలంలో కొనుగోలు వ్యయం సగటుగా మారి లాభాలకు దారితీస్తుంది.

మార్కెట్ పతనం లాభమే!
సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోతుంటే భయపడిపోతుంటారు. కానీ సిప్‌ చేసేవారికి మార్కెట్ పతనాలు ఒక రకంగా వరమనే చెప్పాలి. మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. భవిష్యత్తులో మార్కెట్ మళ్లీ పుంజుకున్నప్పుడు ఈ తక్కువ ధరకు కొన్న యూనిట్లే భారీ లాభాలను తెచ్చిపెడతాయి. అయితే చాలామంది మార్కెట్ పడగానే భయంతో ‘సిప్‌’లు ఆపేస్తుంటారు. ఇలా మధ్యలోనే తప్పుకోవడం వల్ల దీర్ఘకాలిక సంపద సృష్టి దారుణంగా దెబ్బతింటుంది.

ఫండ్‌ ఎంపికలో తప్పులు
పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినా ఆశించిన రిటర్న్స్ రాకపోవడానికి, కొన్నిసార్లు నష్టాలు రావడానికి ఫండ్ ఎంపికలో తప్పులు చేయడమే ప్రధాన కారణం. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకేలా పనిచేయవు. ఎక్కువ రిస్క్ ఉండే థిమాటిక్ ఫండ్స్ లేదా సరిగ్గా మేనేజ్ చేయని ఫండ్స్‌లో పెట్టడం వల్ల పదేళ్ల తర్వాత కూడా నిరాశే మిగులుతుంది. కాంపౌండింగ్ ప్రక్రియలో ఏడాదికి కేవలం 3 నుంచి 4 శాతం రిటర్న్స్ తేడా వచ్చినా పదేళ్ల తర్వాత వచ్చే మొత్తంలో అది రూ.లక్షల వ్యత్యాసాన్ని చూపిస్తుంది.

కంటికి కనిపించని శత్రువు ‘ద్రవ్యోల్బణం’
ఎస్‌ఐపీ పోర్ట్‌ఫోలియో 10-12 శాతం రిటర్న్స్ ఇస్తున్నప్పటికీ బ్యాగ్రౌండ్‌లో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మీ డబ్బు విలువను తగ్గించేస్తుంటుంది. నేడు రూ.కోటి విలువ పదేళ్ల తర్వాత అదే స్థాయిలో ఉండదు. అందుకే కేవలం ఒకే మొత్తాన్ని పదేళ్ల పాటు అలాగే ఉంచకుండా.. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగే కొద్దీ ఎస్‌ఐపీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుకుంటూ పోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఓపిక ఉన్నవాడిదే విజయం
పదేళ్ల సిప్‌ రాత్రికి రాత్రే ధనవంతులను చేసే షార్ట్‌కట్ కాదు. అది కాంపౌండింగ్‌కు మనం ఇచ్చే ఒక మంచి సమయం మాత్రమే. మీ ఫండ్ నాణ్యత, మీ క్రమశిక్షణ, మార్కెట్ పడుతున్నప్పుడు కూడా పెట్టుబడిని ఆపకుండా కొనసాగించే మీ ఓపికే మిమ్మల్ని నిజమైన విజేతగా నిలబెడతాయి.

SIP investments
Systematic Investment Plan
mutual funds
investment strategies
financial planning
market risks
long term investments
investment returns
rupee cost averaging
inflation

More Telugu News