హైదరాబాద్ పుష్పక్ తరహాలో.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
- విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు
- త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- జులైలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లక్ష్యం
- ప్రయాణికుల కోసం పలుచోట్ల ఏసీ ప్యాసింజర్ లాంజ్‌ల నిర్మాణం
జులై మొదటి వారంలో విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్‌లోని పుష్పక్ బస్సుల తరహాలో ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను నడిపి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తామని తెలిపారు. జాతీయ రహదారి-16, బీచ్ రోడ్ కారిడార్ల మీదుగా ప్రధానంగా ఈ సర్వీసులు నడవనున్నాయి.
వాస్తవానికి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై గత కొంతకాలంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 8 నుంచి 30 బస్సులతో సర్వీసులు ప్రారంభించాలని ప్రతిపాదనలు వచ్చాయి. తాజా ప్రకటనతో బస్సుల సంఖ్యను 50కి పెంచినట్లు స్పష్టమైంది. దీనికి తోడు, కూర్మన్నపాలెం, గాజువాక, ఎన్ ఏడీ జంక్షన్, మద్దిలపాలెం, మధురవాడ, తగరపువలస వంటి కీలక ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం ఏసీ ప్యాసింజర్ లాంజ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
విశాఖకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం విమానాశ్రయం నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇది ఉత్తరాంధ్రకు ప్రధాన ఏవియేషన్ హబ్‌గా మారనుంది. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోనే బస్సుల కోసం తాత్కాలిక ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను, రూట్లను మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త బస్సు సర్వీసుల ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.