ఈసారి కూడా వాళ్లదే కప్... ఐపీఎల్-2026 ఛాంపియన్ ఆర్సీబీ... ఫైనల్లో గుజరాత్ ఓటమి!

  • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
  • రెండోసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • అజేయ అర్ధశతకంతో (75*) జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ
  • తొలుత గుజరాత్‌ను 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు
  • సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీకి ఘనమైన విజయాన్ని అందించిన కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు.

156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు, కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32) దూకుడుగా ఆడాడు. ఈ జోడీ కేవలం 21 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఐపీఎల్ ఫైనల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

అయితే, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో ఆర్సీబీ కాస్త నెమ్మదించింది. రజత్ పాటిదార్ (14) కొన్ని చక్కటి షాట్లు ఆడినప్పటికీ, రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పటీదార్‌ను, కృనాల్ పాండ్యా (0)ను ఔట్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచాడు. ఈ దశలో కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కోహ్లీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని జట్టుపై ఒత్తిడిని తగ్గించాడు. 

టిమ్ డేవిడ్ (11) కూడా త్వరగానే ఔటయినా, కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 63 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ పట్టిన డైవింగ్ క్యాచ్‌ను రీప్లేలలో బంతి నేలను తాకినట్లు తేలడంతో కోహ్లీకి లైఫ్ లభించింది. ఆ తర్వాత, అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది ఆర్సీబీకి ఘనవిజయాన్ని అందించాడు.

అంతకుముందు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్; 37 బంతుల్లో) ఒంటరి పోరాటం చేసి అర్ధశతకంతో ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో సత్తా చాటగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ విజయంతో ఆర్సీబీ, ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ అరుదైన ఘనత సొంతం చేసుకోవడం విశేషం. ఆర్సీబీ ఈ విజయంతో... వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. కెప్టెన్ గానూ రజత్ పటీదార్ వరుసగా రెండు టైటిళ్లతో రికార్డు పుటల్లోకెక్కాడు. 

సీఎస్కే జట్టు 2010, 2011లో వరుసగా టైటిళ్లు గెలవగా... ముంబై ఇండియన్స్ 2019, 2020లో విజేతగా నిలిచింది. ఆర్సీబీ 2025, 2026లో టైటిళ్లు గెలిచి ఆ రెండు జట్ల సరసన చేరింది.

2025లో ఇదే స్టేడియంలో తొలి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత తమ టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిళ్లను ఒకేసారి కలిగి ఉన్న ఏకైక ఫ్రాంచైజీగా అరుదైన ఘనత సాధించింది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే ట్రోఫీని గెలుచుకోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి.




Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Indian Premier League
Gujarat Titans
Cricket
T20
Washington Sundar
Rasikh Salam Dar

More Telugu News