ఆ విషయం చిట్‌చాట్‌లో చెప్పడం కాదు... అధికారికంగా ప్రకటించాలి: కవిత డిమాండ్

Kavitha Demands Official Announcement on Free Electricity for Farmers
  • రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై చిట్‌చాట్‌లో కాకుండా అధికారికంగా ప్రకటించాలన్న కవిత
  • రైతు డిస్కం పేరుతో మిగతా డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • ఈ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరిక
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడటం కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయానికి మీటర్లు బిగించేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో ముందుకెళుతున్నాయని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కవిత ఆరోపించారు. ఈ పేరుతో మిగిలిన రెండు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కుట్రను అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరించారు. అదేవిధంగా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త సోలార్ జీవో కేవలం బడా కార్పొరేట్ సంస్థలకే మేలు చేస్తుందని ఆమె విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును దసరా నాటికి ప్రతిపాదించకపోతే, తాను పాదయాత్ర చేపడతానని కవిత హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 18 రోజుల పసికందు చేయి కోల్పోయిన ఘటనపై కవిత తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దారుణమని, దీనికి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులే బాధ్యత వహించాలన్నారు. ఆ చిన్నారి పేరిట ప్రభుత్వం రూ.25 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Kavitha
Kalvakuntla Kavitha
TRS
Telangana Rashtra Samithi
Revanth Reddy
24 hours free electricity
Farmers
Telangana
Farmer Discoms
Lakshmidevipalli Project

More Telugu News