70 ఏళ్ల శకం ముగిసింది.. ముంబైలో మూతపడిన ఎయిర్ ఇండియా కాలనీలు!

Air India Colony Mumbai Closes After 70 Years
  • ముంబైలోని చారిత్రక ఎయిర్ ఇండియా కాలనీలను ఖాళీ చేసిన ఉద్యోగులు 
  • 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కాలనీలు 184 ఎకరాల్లో విస్తరణ
  • ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటంలో ఉద్యోగుల ఓటమి
  • పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్లు ఈ కాలనీ మైదానాల్లోనే ఎదిగిన వైనం
  • ఈ భూమిని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగింత
దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పుట్టిన నగరంలో ఆ సంస్థకు చెందిన చివరి ఆనవాళ్లు కూడా కనుమరుగవుతున్నాయి. ముంబైలోని శాంతాక్రూజ్ ఈస్ట్, కలినాలో ఉన్న చారిత్రక ఎయిర్ ఇండియా ఉద్యోగుల కాలనీల 7 దశాబ్దాల శకం నేటితో (మే 31) ముగిసింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, చివరి నివాసితులు కూడా ఈ కాలనీలను వీడి వెళ్లడంతో, ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ఈ కాలనీల ఖాళీ ప్రక్రియ ఎయిర్ ఇండియా ప్రస్థానంలో ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచిపోయింది.

1955లో నిర్మించిన ఈ కాలనీలు దాదాపు 184 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం నాలుగు కాలనీలలో 106 భవనాల్లో 1,683 ఫ్లాట్లు ఉండేవి. ఒకప్పుడు వేలాది కుటుంబాలతో కళకళలాడిన ఈ ప్రాంగణంలో, చివరిగా మిగిలిన సుమారు 150 కుటుంబాలు నేడు తమ ఇళ్లను ఖాళీ చేశాయి. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగులే. రెండు దశాబ్దాల క్రితం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (MIAL)కు లీజుకు ఇచ్చిన ఈ భూమిని ఇప్పుడు పూర్తిగా వారికి అప్పగించనున్నారు.

2022లో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, యాజమాన్యం ఈ కాలనీలను ఖాళీ చేయమని ఆదేశించింది. అయితే, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లు తమ సర్వీస్ కండిషన్‌లో భాగమని పేర్కొంటూ ఉద్యోగులు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. లేబర్ కోర్టు నుంచి బాంబే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. 2025 నవంబర్ 30 నాటికి ఇళ్లు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అయితే, పిల్లల చదువులకు ఆటంకం కలగకూడదనే మానవతా దృక్పథంతో, ఆ గడువును అనధికారికంగా 2026 మే 31 వరకు పొడిగించారు.

ఈ కాలనీలు కేవలం నివాస సముదాయాలు మాత్రమే కాదు. ఎందరో క్రీడాకారులకు పురుడుపోసిన గడ్డ. టీమిండియా యువ సంచలనాలు పృథ్వీ షా, యశస్వి జైస్వాల్‌తో పాటు అజింక్య రహానే, శివమ్ దూబే వంటి ప్రముఖ క్రికెటర్లు ఇక్కడి క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాల్లోనే తమ నైపుణ్యాలకు పదును పెట్టారు. ఇక్కడ రెండు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఉండేవి. 2018 ముంబై వరదలు, కోవిడ్ సమయంలో కార్గో కార్యకలాపాలు వంటి క్లిష్ట సమయాల్లో ఇక్కడి సిబ్బంది నడుచుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి సేవలు అందించారు.

దశాబ్దాల జ్ఞాపకాలను, తాము నాటిన చెట్లను, పిల్లల బాల్యాన్ని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందని చాలా మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నారిమన్ పాయింట్‌లోని ఐకానిక్ ఎయిర్ ఇండియా భవనాన్ని విక్రయించిన తర్వాత, ఇప్పుడు కలినా కాలనీలు కూడా చేజారడంతో ముంబైలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన చివరి ప్రధాన స్థిరాస్తి కూడా దూరమైనట్లయింది.
Go Back to Shorts
Air India
Air India colony Mumbai
Mumbai Airport
Air India privatization
Prithvi Shaw
Yashasvi Jaiswal
Ajinkya Rahane
Mumbai International Airport Limited
Air India employees

More Telugu News