హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు!

  • బాధితలు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తింపు
  • గల్లంతైన వారిలో ఇద్దరు చిన్నారులు
  • జీపీఎస్ ట్రాకింగ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రమాదం
  • నో-నెట్‌వర్క్ జోన్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది గల్లంతయ్యారు. బాధితుల్లో బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెండు కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చంబా జిల్లాలోని బైరాగఢ్-సచ్ పాస్ మార్గంలో కాలాబన్ సమీపంలో ఈ విషాదం జరిగింది.

బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో కుటుంబం వేసవి సెలవుల కోసం దల్హౌసీ హిల్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని, మంచు పర్వతాలను చూసేందుకు శుక్రవారం సచ్ పాస్ మార్గంలో బయలుదేరారు. అయితే, వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ట్యాక్సీ యజమాని వాహనానికి ఉన్న జీపీఎస్ సిగ్నల్‌ను ట్రాక్ చేశాడు. కాలాబన్ సమీపంలో వాహనం కదలకుండా ఒకే చోట ఉన్నట్లు చూపించడంతో, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. పరిశీలనలో వాహనం లోయలో పడిపోయినట్లు తేలింది.

ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ప్రాంతం కావడం, అక్కడ ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

"కాలాబన్ సమీపంలో ఎనిమిది మందితో వెళ్తున్న వాహనం లోయలో పడిపోవడం అత్యంత బాధాకరం. స్థానిక యంత్రాంగం, ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించాం. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం" అని సీఎం సుఖు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గల్లంతైన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Himachal Pradesh Accident
Chamba district
Sach Pass
Dalhousie
Road Accident
Taxi Accident
NDRF
India News
Himachal Pradesh

More Telugu News