ఆర్థిక మాంద్యానికి చైనా వింత మందు.. ఖర్చు పెంచేందుకు 'సెలవుల' ప్లాన్!

  • ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న చైనా
  • వినియోగాన్ని పెంచేందుకు సెలవులను పెంచుతున్న ప్రభుత్వం
  • మే డే, న్యూ ఇయర్ వంటి సెలవులను పొడిగించిన వైనం
  • ఒకేసారి సెలవులతో పర్యాటక ప్రాంతాల్లో తీవ్ర రద్దీ
  • రద్దీని తగ్గించేందుకు దశలవారీగా సెలవుల ప్రణాళిక
గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక శక్తిగా దూసుకెళ్లిన చైనా ఇటీవలి కాలంలో తీవ్ర ఆర్థిక మందగమనంతో సతమతమవుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు డ్రాగన్ దేశం ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశ ప్రజలతో ఎక్కువ ఖర్చు పెట్టించి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో 'సెలవుల' మంత్రాన్ని పఠిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తప్పనిసరి ప్రభుత్వ సెలవులను మరో ఐదు రోజులు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.

గత కొన్నేళ్లుగా చైనాలో పని ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటల కారణంగా ప్రజలు సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఈ వినియోగ క్షీణత నేరుగా దేశ జీడీపీపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వరుస సెలవులను ప్రకటిస్తోంది. ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక కథనం ప్రకారం, ప్రజలు సెలవుల్లో పర్యాటక ప్రాంతాలకు వెళితే ప్రయాణం, ఆహారం, వినోదం వంటి రంగాలపై ఖర్చు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా మే డే సెలవులను మూడు రోజుల నుంచి ఐదు రోజులకు, అలాగే చింగ్‌మింగ్‌ పండుగ, నూతన సంవత్సర సెలవులను కూడా పొడిగించింది.

ప్రభుత్వ వ్యూహం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనే ఇస్తోంది. ఇటీవల ప్రకటించిన మే డే సెలవుల్లో దేశవ్యాప్తంగా అదనంగా 11.7 కోట్ల రైల్వే ప్రయాణాలు నమోదయ్యాయి. పర్యాటక రంగంలో వందల కోట్ల యువాన్ల వ్యాపారం జరిగింది. ఈ పర్యాటక ఉత్సాహంతో రాబోయే ఐదేళ్లలో సుమారు రూ. 703 లక్షల కోట్ల (50 లక్షల కోట్ల యువాన్లు) ఆదాయం వస్తుందని చైనా సర్కార్ అంచనా వేస్తోంది.

అయితే, ఈ విధానం కొన్ని కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా అందరికీ ఒకేసారి సెలవులు ఇవ్వడంతో పర్యాటక ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. రవాణా, హోటళ్లపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో చాలామంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులకు కూడా దశలవారీగా వేతనంతో కూడిన సెలవులు (పెయిడ్ హాలిడేస్) మంజూరు చేయాలని యోచిస్తున్నారు. మొత్తానికి ప్రజలతో ఎలాగైనా ఖర్చు పెట్టించి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలనేదే చైనా ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

China Economy
Economic Recession
China Holidays
Tourism China
China GDP
May Day China
Travel China
Paid Holidays China

More Telugu News