'ఎస్ఐఆర్'పై వైసీపీ క్యాడర్ ను అప్రమత్తం చేసిన సజ్జల

Sajjala Ramakrishna Reddy Alerts YSRCP Cadre on SIR
  • 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంపై వైసీపీ ముఖ్య నేతలతో సజ్జల సమీక్ష
  •  ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపు
  •  డీఎస్సీ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పోరాటం ఉధృతం చేయాలని ఆదేశం
  •  ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేసి డిజిటల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచన
  •  ఓటర్ల జాబితా సర్వేపై నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంపై ఆయన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిన్న జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. "చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసనలను విజయవంతం చేయాలి. ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులతో పాటు కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలి" అని ఆదేశించారు.

డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పార్టీ కమిటీలు ప్రత్యేకంగా సమావేశమై తీర్మానాలు చేయాలని, వాటిని డిజిటల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌), ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సజ్జల హెచ్చరించారు. అలాగే, జూన్ 1న డీఎస్సీ అంశంపై పార్టీ యువజన విభాగం చేపట్టనున్న నిరసనలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh
AP Politics
Chandrababu Naidu
TDP
Government Failures
DSC
Voter List
SIR

More Telugu News