చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు!
- కేరళ, తమిళనాడు వైపు వేగంగా విస్తరిస్తున్న గాలులు
- రాష్ట్రంలో క్రమంగా తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు
- ఈరోజు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు రానున్న నాలుగైదు రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి.
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో ఉపశమనం లభించనుంది. జూన్ 1 నుంచి హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు, ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీలకు తగ్గుతాయని అంచనా. జూన్ 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడనున్నాయి. కాగా, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.