బాల్యవివాహాలు, గృహహింస.. దక్షిణాదిన తెలంగాణలోనే అత్యధికం

  • భారతీయుల గుండె లయ తప్పుతోందన్న జాతీయ సర్వేలు 
  • దేశంలో 60 శాతానికి పైగా మరణాలకు అసాంక్రమిక వ్యాధులే కారణం
  • ఆందోళనకరంగా పెరుగుతున్న  గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం కేసులు 
  • మహిళల్లో గణనీయంగా పెరిగిన ఇంటర్నెట్ వాడకం, బ్యాంకు ఖాతాలు
దేశంలో మారుతున్న జీవనశైలి ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. జాతీయ ‘నమూనా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ’ (SRS), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) విడుదల చేసిన తాజా నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో సంభవిస్తున్న మొత్తం మరణాలలో 60 శాతానికి పైగా గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యల వంటి అసాంక్రమిక వ్యాధుల (NCD) వల్లే జరుగుతున్నాయని ఈ సర్వేలు తేల్చాయి.

నివేదికల ప్రకారం.. దేశంలో అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో ఏకంగా 32.1 శాతం కేవలం గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం కేసులు తీవ్ర ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. పురుషుల్లో మధుమేహుల సంఖ్య 20.9 శాతానికి, మహిళల్లో 17.8 శాతానికి చేరింది. మరోవైపు, 15-29 ఏళ్ల యువతలో ఆత్మహత్యల మరణాలు 19 శాతానికి పెరగడం కలచివేస్తోంది. అయితే, అంటువ్యాధుల మరణాలు తగ్గడం, రక్తపోటు సమస్య స్వల్పంగా నియంత్రణలో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ సర్వేలో మహిళల సామాజిక-ఆర్థిక స్థితిగతులపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3 శాతం నుంచి 64.3 శాతానికి పెరిగింది. ఈ విషయంలో కేరళ (87.3 శాతం) అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ (64.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (63.6 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దాదాపు 89 శాతం మంది మహిళలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

అయితే, మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ బాల్యవివాహాలు, గృహహింస వంటి సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 20 శాతం బాల్య వివాహాలు జరుగుతుండగా, 22.3 శాతం మంది మహిళలు భర్తల నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 30.8 శాతం మంది మహిళలు గృహహింస బాధితులుగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

Telangana
Child Marriages
Domestic Violence
NFHS-6
National Family Health Survey
SRS
Sample Registration System
Womens Health
Womens Rights
Social Issues

More Telugu News