ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం

  • హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో గుజరాత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువని విశ్లేషణ
  • గుజరాత్‌కు 60-40 గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చావ్లా
  • ఫైనల్లో ఏ జట్టు గెలిచినా ఇది రెండో ఐపీఎల్ టైటిల్
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31న జరగనున్న టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ జట్టే గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా జోస్యం చెప్పాడు.

ఆర్సీబీ అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఫైనల్ మ్యాచ్ గుజరాత్ సొంత మైదానంలో జరగడమే ఆ జట్టుకు అతిపెద్ద బలమని చావ్లా అభిప్రాయపడ్డాడు. అహ్మదాబాద్ స్టేడియాన్ని గుజరాత్ ఈ సీజన్‌లో తమకు కంచుకోటగా మార్చుకుందని, ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచిందని గుర్తుచేశాడు. సొంత ప్రేక్షకుల మద్దతు, పిచ్‌పై పూర్తి అవగాహన వంటి అంశాల వల్ల గుజరాత్‌కు 60-40 గెలుపు అవకాశాలు ఉన్నాయని విశ్లేషించాడు.

ఈ ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. క్వాలిఫయర్-1లో గుజరాత్‌ను ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. అయితే, క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో గుజరాత్ ఏకంగా 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు దూసుకొచ్చింది.

గుజరాత్ 2022లో, ఆర్సీబీ 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిచినా వారికిది రెండో కప్ అవుతుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్‌ను, సొంతగడ్డపై బలంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Piyush Chawla
IPL 2026
Gujarat Titans
Royal Challengers Bangalore
RCB vs GT
IPL Final Prediction
Shubman Gill

More Telugu News