సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్!

Sovereign Gold Bond SGB Scheme Gives 227 Percent Return
  • ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II ముందస్తు విమోచన ధరను ప్రకటించిన ఆర్‌బీఐ
  • యూనిట్‌కు రూ.15,672గా ధరను నిర్ధారించిన కేంద్ర బ్యాంకు
  • ఐదేళ్ల క్రితం జారీ ధర రూ.4,792 కాగా.. ఇప్పుడు 227 శాతం లాభం
  • జూన్ 1 నుంచి బాండ్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుభవార్త అందించింది. ఐదేళ్ల క్రితం జారీ చేసిన ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II బాండ్లకు సంబంధించిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ (ముందస్తు విమోచన ధర)  ప్రకటించింది. పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో ఏకంగా 227 శాతం అద్భుతమైన రాబడిని అందించేలా యూనిట్‌కు రూ.15,672గా ధరను ఖరారు చేసింది. అంటే.. ఇక్కడ ఐదేళ్ల కిందట రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి ఇప్పుడు రూ. 3.27 లక్షల వరకు రాబడి వచ్చింది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఐదేళ్ల తర్వాత, వడ్డీ చెల్లించే తేదీల్లో వాటిని ముందస్తుగానే డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ బాండ్లను 2021 జూన్ 1న జారీ చేసినందున, సరిగ్గా ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1 నుంచి పెట్టుబడిదారులు తమ బాండ్లను నగదుగా మార్చుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

విమోచన ధరను ఎలా లెక్కిస్తారు? 
ముందస్తు విమోచన ధరను నిర్ణయించడానికి ఆర్‌బీఐ ఒక నిర్దిష్ఠ‌ పద్ధతిని అనుసరిస్తుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఆధారంగా దీనిని లెక్కిస్తారు. విమోచన తేదీకి ముందున్న మూడు పని దినాల బంగారం ముగింపు ధరల సగటును తీసుకుంటారు. ఈ సిరీస్ కోసం మే 26, మే 27, మే 29 తేదీల నాటి బంగారం ధరల సగటు ఆధారంగా రూ.15,672గా ధరను నిర్ణయించారు.

పెట్టుబడిదారులకు జాక్‌పాట్ 
2021లో ఈ బాండ్లను జారీ చేసినప్పుడు, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి ఒక గ్రాము (యూనిట్) ధర రూ.4,792గా ఉంది. ఆఫ్‌లైన్‌లో కొన్నవారికి దీని ధర రూ.4,842గా ఉంది. ఇప్పుడు ఆర్‌బీఐ ప్రకటించిన విమోచన ధర రూ.15,672తో పోలిస్తే, ఆన్‌లైన్ పెట్టుబడిదారులకు ప్రతి గ్రాముపై వడ్డీని మినహాయించి రూ.10,880 నికర లాభం వస్తోంది. అంటే.. కేవలం ఐదేళ్ల కాలంలోనే వారి పెట్టుబడిపై 227.05 శాతం రాబడి లభించినట్లయింది. సాధారణంగా ఎస్‌జీబీల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా, ఐదేళ్ల తర్వాత ఇలాంటి అధిక రాబడితో బయటకు వచ్చే అవకాశం కల్పించడం పెట్టుబడిదారులకు ఎంతో లాభదాయకంగా మారింది.
Go Back to Shorts
Sovereign Gold Bond
SGB
RBI
Gold Investment
Investment Returns
Gold Prices
IBJA
Premature Redemption
Gold Bonds India

More Telugu News