గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ

DK Shivakumar Meets Governor Amid Karnataka CM Race
  • సీఎల్పీ సమావేశానికి ముందే గవర్నర్‌తో డీకే భేటీ
  • ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు ఊహాగానాలు
  • ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం
  • మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో లాబీయింగ్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అనూహ్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరగడానికి ముందే ఆయన శనివారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన, గవర్నర్‌తో అనధికారికంగా సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రిగా తనను ఎన్నుకునే పక్షంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, తేదీలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని శివకుమార్ వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిష్కులు సూచించిన ప్రకారం జూన్ 1, 3, 5 తేదీల్లో ఒక మంచి ముహూర్తాన్ని ఖరారు చేసే అంశంపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు డీకే శివకుమార్ మొగ్గు చూపుతున్నారని, ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయానికి కూడా చేరవేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రమాణ స్వీకార వేదికగా విధాన సౌధ మెట్ల భాగాన్ని గానీ, రాజ్‌భవన్‌ను గానీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి పదవుల కోసం తీవ్రమైన లాబీయింగ్ మొదలైంది. లింగాయత్ వర్గం నుంచి సీనియర్ నేతలు ఎం.బీ. పాటిల్, ఈశ్వర్ ఖండ్రే ఈ పదవిని ఆశిస్తున్నారు. అలాగే, మాజీ స్పీకర్ యూటీ ఖాదర్, సీనియర్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్, సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన జమీర్ అహ్మద్ ఖాన్ కూడా డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి సీనియర్ నేతలు జి.పరమేశ్వర, హెచ్.సి. మహదేవప్ప కూడా ఆశలు పెట్టుకున్నారు.

అయితే, వివిధ వర్గాల నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో పార్టీలో అనవసర విభేదాలు రాకుండా ఉండేందుకు అసలు డిప్యూటీ సీఎం పదవులే లేకుండా చేయాలనే ఆలోచనను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొత్త ముఖ్యమంత్రితో పాటు దాదాపు 12 నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుండగా, అంతకుముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Go Back to Shorts
DK Shivakumar
Karnataka CM
Karnataka Chief Minister
Congress
Siddaramaiah
MB Patil
Eshwar Khandre
Karnataka Politics
CLP meeting
Governor Thawar Chand Gehlot

More Telugu News