రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలపై కోచ్‌ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..!

  • ఆర్‌ఆర్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహంచలేదన్న కెప్టెన్‌ పరాగ్‌
  • ఈ వ్యాఖ్యలతో విభేదించిన కోచ్‌ సంగక్కర
  • టైటిల్ కోసమే జట్టు ఎంపిక చేస్తామని స్పష్టీకరణ
  • పరాగ్ కెప్టెన్సీపై సంగక్కర ప్రశంసలు
  • వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని ధీమా
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్లేఆఫ్స్ అర్హతపై కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలతో హెడ్ కోచ్ కుమార సంగక్కర పూర్తిగా విభేదించారు. ఐపీఎల్ క్వాలిఫైయర్-2 మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరి మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రియాన్ ఏమన్నాడంటే?
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎక్కువ మంది యువకులు, అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారని కెప్టెన్ రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ఈ కారణంగా తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదని, అసలు తాము టాప్-4లో ఉంటామనీ అనుకోలేదని పరాగ్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

కోచ్ సంగక్కర అసంతృప్తి
కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై కోచ్ సంగక్కర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము కేవలం టైటిల్ గెలవాలనే మైండ్‌సెట్‌తోనే ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశాడు. కేవలం ప్లేఆఫ్స్ చేరడం తమ లక్ష్యం కాదని, అరంగేట్రం చేసిన ఆటగాళ్లు సైతం మ్యాచ్‌లు గెలిపించగలరనే నమ్మకంతోనే జట్టులోకి తీసుకుంటామని పరాగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు.

మారిన రాజస్థాన్ వ్యూహాలు
గత నాలుగేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని సంగక్కర వివరించాడు. రెండేళ్ల క్రితం వేలంలో తాము అనుకున్నట్లుగా బడ్జెట్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయామని అంగీకరించాడు. జట్టులో కొంతమందికి అనుభవం లేకపోయినా ప్రతి ఒక్కరూ ఇక్కడ గెలవడానికే వచ్చారని చెప్పాడు.

కెప్టెన్సీపై ప్రశంసలు
వ్యాఖ్యల విషయంలో విభేదించినప్పటికీ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ప్రదర్శనను సంగక్కర అభినందించాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా పరాగ్‌కు ఇది మొదటి సీజన్ అని, మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. భవిష్యత్తులో మరింత మెరుగైన నాయకుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

విమర్శకుల నోళ్లు మూయించారు
టోర్నీ ప్రారంభంలో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుతుందని ఎవరూ నమ్మలేదని సంగక్కర గుర్తు చేశాడు. బయటి వ్యక్తులు తమ సామర్థ్యాన్ని అనుమానించినా ఆటగాళ్లు కష్టపడి ఆడారన్నాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకుని వచ్చే సీజన్ నాటికి మరింత బలంగా పునరాగమనం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

Riyan Parag
Rajasthan Royals
Kumar Sangakkara
IPL
IPL 2024
Indian Premier League
Playoffs
Cricket
RR
Captaincy

More Telugu News