గెలిపించలేని సెంచరీ కంటే.. జట్టును గెలిపించే 80 పరుగులే నాకు ఎక్కువ: వైభవ్

  • జట్టు గెలుపు ముందు వ్యక్తిగత రికార్డులు దిగదుడుపేనన్న వైభవ్ సూర్యవంశీ
  • చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పిన క్రమశిక్షణే దీనికి కారణమని వెల్లడి
  • గెలిపించలేని సెంచరీ కన్నా, గెలిపించే 80 పరుగులే విలువైవని వ్యాఖ్య
  • అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజే ప్రాక్టీస్ ప్రారంభించానని వెల్లడి
  • ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు అంకితమిస్తానని ప్రకటన
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు పరిణతితో కూడిన మాటలతోనూ ఆకట్టుకుంటున్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని, ఈ స్ఫూర్తి తనకు తన తండ్రి నుంచి వచ్చిందని స్పష్టం చేశాడు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"చిన్నప్పటి నుంచి మా నాన్న ఒకే మాట చెప్పేవారు. నువ్వు సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసినా.. ఆ పరుగుల వల్ల జట్టు గెలవకపోతే అవి వ్యర్థం. అవి నీ వ్యక్తిగత రికార్డులకు పనికొస్తాయి తప్ప జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేవారు. అందుకే, గెలిపించలేని సెంచరీ కంటే, జట్టును గెలిపించే 80 పరుగులే నాకు ఎక్కువ విలువైనవి" అని వైభవ్ వివరించాడు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజారినప్పటికీ, తన దృక్పథం మారలేదని తెలిపాడు.

2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజే ప్రాక్టీస్‌కు హాజరవడం వెనుక ఉన్న క్రమశిక్షణ గురించి వివరిస్తూ.. ఇదంతా తన తండ్రి చలవేనని చెప్పాడు. "ఒక్క రోజు ప్రాక్టీస్ చేయకపోయినా నా జీవితం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ రాబోతోంది. వన్డే ఫార్మాట్ నుంచి టీ20 ఫార్మాట్‌కు మారాల్సి ఉన్నందున, నా గేమ్‌పై దృష్టి పెట్టడానికి వెంటనే ప్రాక్టీస్ అవసరమని భావించాను" అని తెలిపాడు.

జట్టు టోర్నీలో ఎంత ముందుకు వెళితే.. తనకు కూడా సెంచరీలు, రికార్డులు సృష్టించే అవకాశాలు అన్ని ఎక్కువగా వస్తాయని వైభవ్ అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ సపోర్ట్ స్టాఫ్ పాత్రను కొనియాడాడు. ఒకవేళ తాము ట్రోఫీ గెలిస్తే, ఆ విజయాన్ని తమ కోచ్‌లు, ఫిజియోలు, ట్రైనర్లతో పాటు ఆర్ఆర్ అభిమానులకు అంకితమిస్తానని ప్రకటించాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 15 ఇన్నింగ్స్‌లలో 242.86 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 65 సిక్సర్లు బాదిన వైభవ్, ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు, 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 600కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Vaibhav Suryavanshi
Rajasthan Royals
RR
IPL 2024
Orange Cap
Cricket
T20
Batting
Century
Indian Premier League

More Telugu News