యువతను ఇలా నిరాశపరచకూడదు: నీట్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

NEET Exam Leak Issue Supreme Court Key Comments
  • పేపర్ లీక్‌తో యువత తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తోందన్న సుప్రీంకోర్టు
  • పేపర్ లీకేజీ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ
  • అన్ని పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి
ఎన్నో ఆశలతో 'నీట్' పరీక్ష రాసిన యువతను ఇలా నిరాశపరచకూడదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన లీక్‌ల నుంచి గుణపాఠం నేర్చుకోలేదంటూ గతవారం కేంద్ర సంస్థ ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల యువత తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తోందని వ్యాఖ్యానించింది.

అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ

ఈ ఏడాది మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తన పర్యవేక్షణలో నిర్వహించే అన్ని పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ వంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు కేంద్ర విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన మాజీ ఇస్రో ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులలో చాలావరకు ఇప్పటికే అమలు చేసినట్లు తెలిపింది. పరీక్ష విధానంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలు, భద్రతా మార్పులను కోర్టుకు వివరించింది.

ఎన్టీఏ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం 16 కొత్త సీనియర్ పోస్టులను ఏర్పాటు చేశామని, టెక్నాలజీ ఆపరేషన్స్, టెస్ట్ సెక్యూరిటీ పర్యవేక్షణకు ఇద్దరు జాయింట్ సెక్రటరీల స్థాయి అధికారులను అడిషనల్ డైరెక్టర్స్ జనరల్‌గా నియమించినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయడం, పరీక్ష పూర్తయ్యాక 90 రోజుల పాటు ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించినట్లు తెలిపింది.

భవిష్యత్తులో నీట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష మోడ్‌లో నిర్వహించాలా లేక పెన్ అండ్ పేపర్ పద్ధతిలోనే కొనసాగించాలా అనే అంశంపై అత్యున్నతస్థాయి కమిటీ సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఐఐటీ, యూజీసీ, సీబీఎస్ఈ తదితర సంస్థల నిపుణులను ఎగ్జామినేషన్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్యం చేసినట్లు ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.
Go Back to Shorts
NEET
NEET Exam
NEET UG 2024
NTA
Supreme Court
Exam Leak
Paper Leak
K Radhakrishnan Committee

More Telugu News